రాజకీయ అండ.. స్వామిజీ ముసుగులో విద్యార్థినులపై అత్యాచారం.. | Case Registered Against Shivarmurthy Seer Of Murugha Mutt | Sakshi
Sakshi News home page

స్వామిజీ ముసుగులో అకృత్యాలు.. ప్రసాదంలో మత్తు మందు కలిపి విద్యార్థినులపై..

Aug 28 2022 8:00 AM | Updated on Aug 28 2022 8:25 AM

Case Registered Against Shivarmurthy Seer Of Murugha Mutt - Sakshi

ఇటీవలే బెంగళూరులో ఓ నకిలీ స్వామి ఐదేళ్లుగా యువతిని బ్లాక్‌మెయిల్‌ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం బయటపడడం తెలిసిందే. ఇంతలోనే ఓ నిఖార్సైన స్వామి, రాష్ట్ర, జాతీయ నేతలతో సన్నిహిత సంబంధాలున్న మఠాధిపతి లైంగిక దాడి కేసులో ఇరుక్కున్నారు. చిత్రదుర్గంలోని మఠంలోని విద్యాలయాల్లో చదివే బాలికలు స్వామి లీలలపై ఏకంగా మైసూరుకు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఆ ప్రముఖ మఠం పరువు బజారున పడింది. 

మైసూరు: చిత్రదుర్గలో ఉన్న ప్రసిద్ధి చెందిన మఠానికి చెందిన స్వామీజీ ఒక ఆ మఠంలో ఉన్న పాఠశాల, కాలేజీలోని విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని బాధిత బాలికలు మైసూరు జిల్లా బాలల సంక్షేమ కమిటీ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. దాంతో మఠాధిపతి అయిన స్వామీజీతో పాటు మొత్తం నలుగురిపై మైసూరు నజరాబాద్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. స్వామీజీ మొదటి నిందితుడు, అక్కడి హాస్టల్‌ వార్డెన్‌ రశ్మి రెండవ నిందితురాలుగా ఉన్నారు.  

ఇక్కడైతే న్యాయం జరగదని..  
వివరాలు... ఆ మఠం ఆధ్వర్యంలో పలు పాఠశాలలు, కాలేజీలు నడుస్తుండగా వందలాది మంది బాలికలు చదువుకుంటున్నారు. మఠం స్వామీజీ పలువురు బాలికల పైన లైంగిక దాడి చేశాడని, చిత్రదుర్గలో అయితే మాకు న్యాయం జరగదని అలోచించి మైసూరుకు వచ్చి ఒడనాడి సేవా సంస్థ ప్రతినిధులను ఆశ్రయించారు. వారితో కలిసి జిల్లా బాలల సంక్షేమ సమితికి ఫిర్యాదు చేశారు. సమితి అధ్యక్షురాలు హెచ్‌.టి.కమల సెలవులో ఉండటంతో సీనియర్‌ సభ్యులు ధనంజయ, అశోక్, సవితా కుమారిలు బాధితుల సమస్యలను ఆలకించారు. తమతో పాటు అనేక మంది విద్యార్థినులకు తీరని అన్యాయం జరిగిందని వివరించారు.  

చిత్రదుర్గానికి కేసు బదిలీ 
ఈ కేసును చిత్రదుర్గ పోలీసులకు బదిలీ చేశారు. సంఘటన జరిగింది అక్కడే కాబట్టి స్థానిక పోలీసులే విచారణ చేయాలని తెలిపారు. బాధిత విద్యార్థినులు మైసూరు ఒడనాడి సంస్థలో ఆశ్రయం పొందుతున్నారని పోలీసులు చెప్పారు.

ప్రసాదంలో మత్తు మందిచ్చేవారు  
హాస్టల్‌ వార్డెన్‌ రశ్మి తమను తీసుకుని వెళ్ళి స్వామీజీ వద్దకు వదిలేవారని, స్వామీజీ మా కష్టసుఖాలను తెలుసుకునే సాకుతో లైంగికంగా వాడుకొనేవారని, ఒకవేళ తాము ఒప్పుకోక పోతే బెదిరించే వారని బాలికలు తెలిపారు. ప్రసాదంలో మత్తు మందు కలిపి మత్తు వచ్చేలా చేసి ఆపైన అత్యాచారం చేసేవారని, ఈ విషయం బయటకి చెబితే చంపేస్తామని బెదిరించేవారని  పోలీసులు ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ మాదిరిగా దౌర్జన్యానికి గురైన అనేక మంది బాలికలు అక్కడ ఉన్నారని, ప్రాణ భయంతో బయటకు రావడం లేదని చెప్పారు. కాగా, నజరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, స్వామీజీ, రశ్మి, మరికొందరిపై పోక్సో చట్టం  కింద కేసులు నమోదు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement