12 ఏళ్ల పాలనపై ప్రజల్లోకి..!  | BJP launches 12 years of Narendra Modi govt | Sakshi
Sakshi News home page

12 ఏళ్ల పాలనపై ప్రజల్లోకి..! 

Jun 2 2026 1:19 AM | Updated on Jun 2 2026 1:19 AM

BJP launches 12 years of Narendra Modi govt

7 నుంచి నెల పాటు దేశవ్యాప్త ప్రచారానికి ప్రణాళిక 

కార్యక్రమాలపై పార్టీ నేతలతో బీజేపీ చీఫ్‌ భేటీలు 

రాజ్యసభ అభ్యర్థిత్వాలపై అభిప్రాయ సేకరణ

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నెల రోజుల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ తరఫున వరుసగా అత్యధిక కాలం పదవిలో కొనసాగిన ప్రధానిగా నిలవనున్నారు. 

ఈ నేపథ్యంలో ఆయన నాయకత్వం, ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ‘విశ్వాసం–అభివృద్ధి–ప్రజా సంక్షేమం’నినాదంతో జూన్‌ 7 నుంచి 21 వరకు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. జూన్‌ 8 నుంచి 14వ తేదీ వరకు ‘ప్రగతి పథ యాత్ర’లు, ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌’సదస్సులు నిర్వహించనున్నారు. 

కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి పదాధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 12 ఏళ్ల మోదీ పాలన ప్రచార అంశాలతో పాటు, సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, కొత్త వారికి అవకాశాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక అంశాలపై జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ సోమవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, ఇతర సీనియర్‌ నాయకులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక భేటీ నిర్వహించారు. ఇందులో పార్టీ ప్రచార కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

సీనియర్‌ నేతలతో ప్రత్యేక బృందాలు 
ప్రచారంలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అమలైన ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు పార్టీ నేతలు వివిధ ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించనున్నారు. పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, దేశ సమగ్ర అభివృద్ధి వంటి అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో ఐదు, జిల్లా స్థాయిలో నలుగురు సీనియర్‌ నాయకులతో ప్రత్యేక బృందాలను బీజేపీ ఏర్పాటు చేసింది. 

ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఎంపీ తన లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రోజు, ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక రోజు పర్యటించనున్నారు. అలాగే వివిధ రంగాలకు చెందిన కనీసం 500 మంది ప్రముఖులను కలిసి ప్రభుత్వ విజయాలను వివరించే సమాచార పత్రాలను అందజేసి సన్మానించనున్నారు. ఆయుష్మాన్‌ భారత్, ఆయుష్మాన్‌ వాయ్‌ వందన, పీఎం సూర్య ఘర్, పీఎం స్వనిధి, లక్‌పతి దీదీ, వీబీ–జీ–రామ్‌ పథకాల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు.సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు, నిపుణుల ఉపన్యాసాలు నిర్వహించనున్నట్లు పార్టీ తెలిపింది. జూన్‌ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ఈ ప్రచార కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 

కొత్త జట్టుపై ముమ్మర కసరత్తు... 
పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తన కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఈ నెలలో ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాటి సమావేశంలో ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. కొందరు ప్రస్తుత పదాధికారులకు మార్పులు ఉండవచ్చని, కొంతమంది కేంద్ర మంత్రులను సంస్థాగత బాధ్యతల్లోకి తీసుకురావచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇందుకుగాను రాష్ట్రాల నుంచి ఆశావహుల జాబితాను సేకరించినట్టు తెలిసింది. 

ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా మోర్చా, యువమోర్చా విభాగాల్లో సమగ్ర పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టనున్న నేపథ్యంలో ఆయా పేర్లపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేక పునర్వ్యవస్థీకరణపైనా చర్చ జరిగినట్లు సమాచారం. ఇక, 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల గడువు జూన్‌ 8తో ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపైనా భేటీలో రాష్ట్రాల నేతలు, అధ్యక్షుల నుంచి అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ అభిప్రాయాలు సేకరించినట్లు చెబుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement