
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరిలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి కొనసాగుతోంది. ఇదే సమయంలో మిత్రపక్షాల కూటమి ‘మహాఘట్ బంధన్’లో సీట్ల లొల్లి మొదలయ్యింది. కూటమిలోని అన్ని పార్టీలు అధిక సీట్లు కోరుతున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తాము రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాల్లోనూ పోటీచేయనున్నట్లు ప్రకటించారు.
శనివారం ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో తేజస్వి ప్రసంగిస్తూ ‘ఈసారి తేజస్వి 243 స్థానాల్లోనూ పోటీ చేస్తారు. అది ముజఫర్‌పూర్ అయినా మరొకటైనా.. తేజస్వి పోరాడుతారు. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే నా పేరు మీద ఓటు వేయండి. బీహార్‌ను ముందుకు తీసుకెళ్లడానికి తేజస్వి కృషి చేస్తారు... మనమందరం కలిసి పనిచేసి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి’ అని అన్నారు.
ఇటీవల రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ఓటరు అధికార్ యాత్రలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్.. ప్రజల ఓటు హక్కును లాక్కొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా, పశుపతి పరాస్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీలను చేర్చుకోవడం ద్వారా మహాఘట్ బంధన్‌లో ఇప్పటికే సీట్ల కేటాయింపు సమస్యగా మారింది. ఇటువంటి తరుణంలో తేజస్వి యాదవ్ తాజా ప్రకటన సంచలనంగా పరిణమించింది.
2020 బీహార్ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) కూటమిలో భాగంగా 144 నియోజకవర్గాల్లో పోటీ చేసి, 75 స్థానాలు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 19 స్థానాలు గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ తాను బలపడినట్లు భావిస్తోంది. ఓటరు అధికార్ యాత్ర, ఓటు 'చోరీ'సందేశం బీహార్ ప్రజలతో ప్రతిధ్వనించిందని, రాహుల్‌కు, పార్టీకి మరింతగా ప్రజాదరణ పెరిగిదని అనుకుంటోంది.
ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ కృష్ణ అల్లవారు మాట్లాడుతూ కొత్త పార్టీలు కూటమిలోకి వస్తే, ప్రతి పార్టీ తమ వాటాను అందించాల్సి ఉంటుందనుకుంటున్నామని, అయితే సీట్ల కేటాయింపులో సమతుల్యత ఉండాలన్నారు. కాంగ్రెస్ కనీసం 70 నియోజకవర్గాలను కోరుకుంటున్నదని, ఆ సంఖ్య ఇంకా తక్కువ కూడా కావచ్చన్నారు. అయితే 15 మంది ఎమ్మెల్యేలను కలిగిన వామపక్ష పార్టీలు (సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) కూడా మరిన్ని సీట్ల కోసం అభ్యర్థిస్తున్నాయని సమాచారం.
గతంలో రాహుల్ గాంధీ సమక్షంలో తాను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించుకున్న తేజస్వి యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలు మహాఘట్ భంధన్‌లో సీట్ల కేటాయింపును మరిత జఠిలం చేశాయి. ఇదిలా ఉండగా తేజస్వి యాదవ్ మాటలకు స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ ‘తేజస్వి యాదవ్.. మీరు కలలు కనడం ఆపండి. మీకు 243 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదు. మీరు
ఇలాంటి ప్రకటనలతో కాంగ్రెస్, మీ మిత్రదేశాలపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తుండవచ్చు. కానీ బీహార్ ప్రజలకు మీపై నమ్మకం లేదు. మిమ్మల్ని చూస్తే వారికి పశుగ్రాసం కుంభకోణం, ఉద్యోగాల భూకుంభకోణం గుర్తొస్తాయి. ప్రజలు ఎన్డీఏకు, నితీష్ కుమార్, ప్రధాని మోదీ పేరు మీద ఓటు వేస్తారు’ అని అన్నారు.