
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది చూచాయిగా వెల్లడయ్యింది. అక్టోబర్ ప్రారంభంలో ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉండగా, నవంబర్‌లో రెండు లేదా మూడు దశల్లో పోలింగ్ జరగవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కింద నవీకరించిన ఓటరు జాబితాను ప్రచురించిన తర్వాత, అక్టోబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
దసరా తర్వాత అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన రావచ్చని తెలుస్తోంది. నవంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా రెండు లేదా మూడు దశల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. నవంబర్ 15- 20 మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. నవంబర్ 22 గడువుకు ముందే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీలతో కూడిన ఎన్డీఏ బీహార్‌లో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉండగా, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కూడిన ఇండియా బ్లాక్.. సీఎం నితీష్ కుమార్‌ను గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. 243 మంది సభ్యులున్న ప్రస్తుత బీహార్ అసెంబ్లీలో, ఎన్డీఏలో 131 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీలో 80 మంది ఎమ్మెల్యేలు, జేడీ(యూ)-45, హెచ్ఏఎం(ఎస్)-4, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ప్రతిపక్షాల ఇండియా కూటమికి 111 మంది సభ్యుల బలం ఉంది. ఆర్జేడీ 77లో మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్-19, సీపీఐ(ఎంఎల్)-11, సీపీఐ(ఎం)-ఇద్దరు, సీపీఐ-ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు.