బెంగళూరు: కర్ణాటక హైకోర్టులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)కు ఊరట లభించింది. ఆ సంస్థ కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకొని కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల అమలు నిలిపివేసింది. జస్టిస్ నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం.. ప్రభుత్వ ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి విచారణ నవంబర్ 17కి వాయిదా వేసింది.
ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏ సంస్థ అయినా రహదారులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల వంటి బహిరంగ ప్రదేశాల్లో కవాతులు, కార్యక్రమాలు చేపట్టాలంటే ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక సర్క్యులర్‌ను జారీచేసింది.
కాగా, కర్ణాటకలో రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్‌ఎస్‌ఎస్) ఈ నెల అక్టోబర్ 19వ తేదీన తలపెట్టిన ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత నియోజకవర్గం చిట్టాపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ‘రూట్ మార్చ్’నిర్వహించాలని భావించింది. ఈ మేరకు తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే, శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశముందంటూ తహశీల్దార్ అనుమతి నిరాకరించారు. ఆ దరఖాస్తును తిరస్కరించారు.


