Bihar: ఎన్‌కౌంటర్‌తో సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ | Bhagalpur Encounter Sends Shockwaves | Sakshi
Sakshi News home page

Bihar: ఎన్‌కౌంటర్‌తో సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Apr 30 2026 11:50 AM | Updated on Apr 30 2026 12:28 PM

Bhagalpur Encounter Sends Shockwaves

సుల్తాన్‌గంజ్: బిహార్ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పుడు తుపాకుల మోత వినిపిస్తోంది. పట్టపగలు జరిగిన ఓ దారుణ హత్యకు.. కొద్ది గంటల వ్యవధిలోనే ఎన్‌కౌంటర్ రూపంలో పోలీసులు ముగింపు పలికారు. సుల్తాన్‌గంజ్ మున్సిపల్ కౌన్సిల్ ఆఫీసులో జరిగిన రక్తపాతానికి ప్రతీకారంగా జరిగిన ఈ భాగల్‌పూర్ ఎన్‌కౌంటర్.. రాష్ట్రంలో నేరస్తులకు కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఇస్తున్న స్పష్టమైన, కఠినమైన హెచ్చరికగా మారింది.

పట్టపగలు హత్య.. గంటల్లోనే ఎన్‌కౌంటర్
సుల్తాన్‌గంజ్ మున్సిపల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కృష్ణ భూషణ్ కుమార్‌ను దారుణంగా కాల్చి చంపిన ప్రధాన నిందితుడు రామ్‌ధాని యాదవ్‌ను పోలీసులు అదే వేగంతో మట్టుబెట్టారు. ఆ దాడిలో చైర్మన్ రాజ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకునేందుకు నిందితుడిని తీసుకెళ్తుండగా, అతను పోలీసులపైకి కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రామ్‌ధాని ఆసుపత్రిలో మరణించగా, ముగ్గురు పోలీసులు సైతం గాయపడి చికిత్స పొందుతున్నారు.

రాజకీయ రగడ.. విపక్షాల ఆరోపణలు
ఈ ఎన్‌కౌంటర్ బీహార్‌లో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. మృతి చెందిన నేరస్తుడికి బీజేపీ నేతలతో సంబంధాలు ఉన్నాయంటూ ఫోటోలను పంచుకున్న ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్, ప్రభుత్వమే నేరస్తులను కాపాడుతోందని ఆరోపించారు. అయితే అధికార ఎన్‌డీఏ పక్షాలు ఈ విమర్శలను తీవ్రంగా తిప్పికొట్టాయి. చట్టం తన పని తాను చేసుకుపోతోందని బీజేపీ పేర్కొనగా.. ‘ఇది కొత్త బీహార్, ఇక్కడ తూటాకు ఫిరంగితోనే సమాధానం చెబుతాం’ అని కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ స్పష్టం చేస్తూ పోలీసుల చర్యను సమర్థించారు.

‘యూపీ మోడల్’ దిశగా కొత్త ప్రభుత్వం
ఈ ఘటనను అత్యంత విచారకరంగా వర్ణించిన ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారాన్ని, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ అవలంబించిన కఠినమైన విధానాన్ని ఇప్పుడు బీహార్ ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. భాగల్‌పూర్ ఎన్‌కౌంటర్.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాలపై ఉక్కుపాదం మోపడానికి కొత్త ప్రభుత్వ తొలి అడుగుగా నిలిచింది.

ఇది కూడా చదవండి: కప్పు టీ.. కోటిన్నర విరాళం: ఆశ్రమం కోసం అద్భుతం

Advertisement
 
Advertisement
Advertisement