ఒక్క కప్పు టీ తాగితే ఎంత అవుతుంది? పది రూపాయలు.. మహా అయితే వంద రూపాయలు! కానీ అదే టీ కప్పు కోటిన్నర రూపాయల నిధిని సమకూర్చింది. కేరళలోని కోజికోడ్ జిల్లా ఎడచేరిలో జరిగిన ఈ అద్భుతం.. మనుషుల్లో ఇంకా మమకారం మిగిలేవుందని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటారని మరోసారి నిరూపించింది. అప్పుల్లో కూరుకుపోయిన ఒక ఆశ్రమాన్ని కాపాడుకునేందుకు ఊరంతా ఏకమై చేసిన ఈ ‘ఛాయ్ ఛాలెంజ్’ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
అంచనాలను తలకిందులు చేసిన జనప్రవాహం
అనాథలు, వృద్ధుల సంరక్షణ కోసం నెలకు రూ.25 లక్షలు ఖర్చు చేసే ‘తణల్’ ఆశ్రమం ఆర్థిక ఇబ్బందుల్లో పడటంతో, నిర్వాహకులు ‘ఛాయ్ తణల్’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కేవలం 5,000 మంది వస్తారని భావిస్తే, ఏకంగా 18,000 మంది తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎడచేరి వీధులన్నీ జనసంద్రమయ్యాయి. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడినా సరే.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కిలోమీటర్ల మేర క్యూ కట్టి మరీ ప్రజలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒక్కరోజే నగదు రూపంలో రూ. 57.42 లక్షలు రాగా, హామీలతో కలిపి మొత్తం రూ. 1.41 కోట్లు సమకూరడం విశేషం.
ఒంటిపై నగలను కూడా విరాళంగా ఇచ్చి..
ఈ సేవా యజ్ఞంలో కేవలం డబ్బు మాత్రమే కాదు, మనసున్న మనుషులు తమ సర్వస్వాన్ని అందించారు. కొందరు మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసి నిర్వాహకుల చేతిలో పెట్టి కన్నీళ్లు పెట్టించారు. వచ్చిన వారందరికీ టీతో పాటు సుమారు 13,000 అరటికాయ బజ్జీలు (పళమ్ పోరి) వడ్డించారు. బజ్జీలు అయిపోతే సమోసాలు, అవి కూడా అయిపోతే బిస్కెట్లు అందించారు. ఇలా ఏదీ అందకపోయినా, ఆశ్రమానికి సాయం చేయాలన్న తపనతో జనం క్యూలోనే నిలబడ్డారు.
సంగీత హోరులో సాగిన సేవ
ప్రముఖ గాయకులు ప్రేమ్‌కుమార్ వడకర, సల్వాన్ వడకర తమ పాటలతో అక్కడ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. గానలహరి మధ్య ప్రజలు ఉత్సాహంగా విరాళాలు అందజేశారు. వార్షికంగా రూ.నాలుగు కోట్ల ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ‘తణల్’ ఆశ్రమానికి, ఈ ఒక్కరోజు స్పందన కొండంత అండగా నిలిచింది. ఒక టీ కప్పు సాక్షిగా కోజికోడ్ ప్రజలు రాసిన ఈ మమతానురాగాల కథ దేశవ్యాప్తంగా అందరి హృదయాలను గెలుచుకుంటోంది.
ఇది కూడా చదవండి: ‘పాక్‌లో జమ్మూ?’.. నాలిక్కరుచుకుని నేపాల్ క్షమాపణలు!


