‘పాక్‌లో జమ్మూ?’.. నాలిక్కరుచుకుని నేపాల్‌ క్షమాపణలు! | Nepal Airlines Gives Clarity And Apologizes After Showing J&K As Part Of Pakistan In Map, Check More Details | Sakshi
Sakshi News home page

‘పాక్‌లో జమ్మూ?’.. నాలిక్కరుచుకుని నేపాల్‌ క్షమాపణలు!

Apr 30 2026 10:02 AM | Updated on Apr 30 2026 10:23 AM

Nepal Airlines Apologizes JK Shown in Pakistan Map

న్యూఢిల్లీ: భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్‌ను పాకిస్తాన్ మ్యాప్‌లో చూపిస్తూ నేపాల్ ఎయిర్‌లైన్స్ చేసిన ఒక ఘోరమైన తప్పిదం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ వివాదాస్పద ‘నెట్‌వర్క్ మ్యాప్’ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. తప్పు తెలుసుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగివచ్చి, భారత్‌ను క్షమాపణలు కోరింది.

సోషల్ మీడియాలో తీవ్ర దుమారం
నేపాల్‌కు చెందిన అధికారిక విమానయాన సంస్థ ‘నేపాల్ ఎయిర్‌లైన్స్’ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్న ఒక మ్యాప్ తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ నెట్‌వర్క్ మ్యాప్‌లో జమ్మూకశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో ఉన్నట్లుగా చూపించారు. ఈ మ్యాప్‌ను గమనించిన భారతీయులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఊహించని ఈ పరిణామంతో అప్రమత్తమైన సంస్థ, తీవ్ర వ్యతిరేకత రావడంతో బుధవారం నాడే ఆ వివాదాస్పద పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆఘమేఘాల మీద తొలగించింది.

బహిరంగ క్షమాపణలు చెబుతూ..
ఈ ఘోర తప్పిదంపై గురువారం నాడు నేపాల్ ఎయిర్‌లైన్స్ అధికారికంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. ‘మా సోషల్ మీడియాలో ఇటీవల పంచుకున్న నెట్‌వర్క్ మ్యాప్‌లో దొర్లిన తప్పుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి.. మ్యాప్‌లో ఉన్న భౌగోళిక దోషాలు నేపాల్ దేశపు అధికారిక వైఖరిని లేదా నేపాల్ ఎయిర్‌లైన్స్ అభిప్రాయాన్ని ఏమాత్రం ప్రతిబింబించవు’ అని స్పష్టం చేసింది.

లోపాలను సరిదిద్దే పనిలో అంతర్గత విచారణ
తాము వెంటనే ఆ వివాదాస్పద పోస్ట్‌ను తొలగించామని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా అత్యున్నత ప్రమాణాలు పాటించేలా అంతర్గత విచారణ జరుపుతున్నామని సంస్థ వెల్లడించింది. ‘పొరుగు దేశాలతో, స్నేహితులతో మాకున్న బలమైన సంబంధాలను మేము ఎంతో గౌరవిస్తాం. ఈ పోస్ట్ వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మేము చింతిస్తున్నాం’ అని నేపాల్ ఎయిర్‌లైన్స్‌ ఒక ప్రకటనలో వివరించింది.

ఇది కూడా చదవండి: ‘ఒరేయ్ సూరీడూ... ఉల్లికి లొంగిపోతావురా’?

Advertisement
 
Advertisement
Advertisement