దేశమంతటా ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పులతో జనాలు అల్లాడిపోతూ ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల.. ‘తన కారులో ఏసీ వాడనని, కేవలం జేబులో ఉల్లిపాయ పెట్టుకుని ఎండల నుంచి రక్షణ పొందుతున్నానని’ చెప్పడం సంచలనం సృష్టించడంతో పాటు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఇంతకీ జేబులో ఉల్లిపాయ పెట్టుకుని, రోడ్లపై తిరిగితే నిజంగానే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చా? దీని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి?
ఉల్లి చేసే మేలు.. పెద్దల నమ్మకం
ఉల్లిపాయల్లో విటమిన్ సి, బి6, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి సహజమైన చల్లదనాన్ని ఇస్తాయి. అందుకే వేసవిలో పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటుంటారు. పూర్వకాలం నుంచి పెద్దలు ఎండలోకి వెళ్లేటప్పుడు జేబులో ఉల్లిపాయ పెట్టుకుని వెళ్లాలని సూచించేవారు. ఇలా చేయడం వల్ల వడదెబ్బ తగలదని వారు బలంగా నమ్మేవారు. ఇప్పుడు మంత్రి సింధియా కూడా ఎండను తట్టుకోవడానికి ఇదే పాత పద్ధతిని పాటిస్తున్నారు.
జేబులో ఉల్లి.. సైన్స్ ఏమంటోంది?
శాస్త్రీయంగా చూస్తే, ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే క్వెర్సెటిన్ వంటి సమ్మేళనాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి. ఉల్లిపాయను తినడం వల్ల శరీరానికి లోపలి నుంచి చల్లదనం అందుతుంది. అయితే జేబులో ఉల్లిపాయను పెట్టుకోవడం వల్ల వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. జేబులో ఉల్లిపాయ ఉంచుకున్నంత మాత్రాన శరీర ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పూ రాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వడగాల్పుల నుంచి రక్షణ ఎలా?
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే చల్లగా ఉంటుందనే అపోహలను పక్కనపెట్టి, ఎండల నుంచి రక్షణ పొందేందుకు శాస్త్రీయమైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. బయటకు వెళ్లేటప్పుడు తల, ముఖం కవర్ అయ్యేలా కాటన్ వస్త్రం ధరించాలి. శరీరాన్ని చల్లగా ఉంచే కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, కీరదోస, గ్లూకోజ్ వాటర్ వంటివి తీసుకోవాలి. ప్రతి అరగంటకు ఒకసారి నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. వదులుగా ఉండే లేత రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఆరుబయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మళ్లీ ‘కోహినూర్’ పంచాయితీ.. మామ్దానీ సంచలన ప్రకటన


