బెంగళూరు డేకేర్‌లో పిల్లలపై హింస
ఐదుగురు మహిళలపై కేసు
బెంగళూరు: డేకేర్ సెంటర్ పిల్లల పాలిట నరకమైంది. బెంగళూరులో కార్పొరేట్ సంస్థలోని డేకేర్ సంరక్షణలో ఉన్న పిల్లలను అక్కడ పనిచేస్తున్న సిబ్బంది దారుణంగా శిక్షించారు. ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగ సమయంలో పిల్లల్ని ఈ డేకేర్ సెంటర్‌లో వదిలి వెళ్తున్నారు. అక్కడ పని చేసే ఐదుగురు సిబ్బంది పిల్లల అల్లరిని మాన్పించడానికి పైశాచిక పద్ధతులు అనుసరించారు. చిన్న పిల్లలనే మానవత్వం లేకుండా కర్కశంగా శిక్షించారు.
పిల్లలు ఏడ్చినప్పుడు ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్‌లో ఉంచి తలుపు మూసేసి భయపెట్టారు. వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్‌పై కూర్చోబెట్టి, హై ప్రెజర్ జెట్‌తో నోట్లో నీళ్లు కొట్టడం, చీకటి బాత్‌రూమ్‌లో బంధించడం వంటివి చేశారు. ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ క్యాప్‌జెమిని బెంగళూరు క్యాంపస్‌లో నడుస్తున్న డేకేర్ నుంచి బయటికొచ్చి వీడియోలు పిల్లల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి.
వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురు మహిళలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదుదారులు, డేకేర్ సిబ్బంది, ఇతర సాక్షుల నుంచి వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. పోలీసులు ఫుటేజీని ధృవీకరించి, సంఘటనల క్రమాన్ని పరిశీలిస్తున్నారు. ఆ డేకేర్ సెంటర్‌లో ఇలాంటి వేధింపులు చాలాకాలంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.


