బెంగళూరులో ఘరానా మోసం
యశవంతపుర: కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసగించే కిలాడీ దంపతులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన జైసన్ డిసోజా, లవీనా దంపతులు నిరుద్యోగులు. వీరు ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న యువకులను గుర్తించి, కోర్టుల్లో గ్రూప్–డి ఉద్యోగాలను ఇప్పిస్తామని నమ్మించేవారు. నిరుద్యోగులను గుర్తించేందుకు ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డబ్బు వసూలు చేశారు.
ఖరీదైన హోటల్స్‌లో ధ్రువపత్రాల తనిఖీ, ఇంటర్వ్యూలు అని నాటకాలు ఆడేవారు. నకిలీ నియామక పత్రాలను చేతిలో పెట్టేవారు. నకిలీ పత్రాలు తీసుకుని కోర్టులకు వెళ్లినవారికి తాము మోసపోయామని అర్థమయ్యేసరికి, ఈ జంట ఫోన్‌లను స్విచాఫ్ చేసేది. చేసేది లేక బాధితులంతా బసవేశ్వరనగరతో పాటు నగరంలోని వివిధ ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. 500 మంది నుంచి రూ.25 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. 2024లో ఇదే ఫిర్యాదుపై అరెస్టయి కొన్నాళ్లు జైలులో ఉండి వచ్చిన ఈ దంపతులు, మళ్లీ అదే దందా కొనసాగిస్తున్నారని, కేసు విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


