బావమరిదిని చంపి డిక్కీలో వేసుకుని పోలీసుల వద్దకు.. | Anekal Incident | Sakshi
Sakshi News home page

బావమరిదిని చంపి డిక్కీలో వేసుకుని పోలీసుల వద్దకు..

Mar 28 2026 1:31 PM | Updated on Mar 28 2026 2:03 PM

 Anekal Incident

బెంగళూరు: బంధువుల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసిన ఘటన బెంగళూరు శివారులోని ఆనేకల్‌ తాలూకా బన్నేరుఘట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. తన సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో వరుసకు బావమరిది అయిన యువకుడికి ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టుకుని నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వివరాలు.. 

బన్నేరుఘట్ట సమీపంలోని బైరప్పనహళ్లి నివాసి శ్రీనివాస్‌ నిందితుడు. మరసూరు వాసి, తన సొంత బావమరిది రంజిత్‌(24)ను హత్య చేశాడు. శ్రీనివాస్‌కు రంజిత్‌ సొంత సోదరి పవిత్రతో వివాహం జరిగింది. దీంతో రంజిత్, నిందితుడైన శ్రీనివాస్‌కు సొంత బావమరిది అయ్యాడు. నిందితుడైన శ్రీనివాస్‌ సోదరి కోమలతో రంజిత్‌కు అక్రమ సంబంధం ఉందని చెబుతున్నారు. కోమలికి అప్పటికే వేరొకరితో వివాహం జరిగింది. అయినప్పటికీ ఆమె తన భర్తను విడిచిపెట్టి రంజిత్‌తో పారిపోయింది. ఈ సంఘటన రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలకు కారణమైంది.  

పరువు తీశాడనే కోపంతో.. 
తన కుటుంబ పరువును పది మందిలో వేలం వేస్తున్నాడనే కోపంతో శ్రీనివాస్‌ చాలాసార్లు రంజిత్‌ను హెచ్చరించాడు. కానీ అతను వినిపించుకోలేదు. దీంతో ఆగ్రహించిన శ్రీనివాస్‌ ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురు చూశాడు. సినీ ఫక్కీలో హత్య చేయడానికి పథకం వేసిన శ్రీనివాస్‌ గురువారం సాయంత్రం మాట్లాడదామనే నెపంతో రంజిత్‌ను తన కారులోకి ఎక్కించుకున్నాడు. బన్నేరుఘట్టలోని బిల్వరదహళ్లిలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చంపేశాడు. 

ఆ తర్వాత రక్తసిక్తమైన ఆ మృతదేహాన్ని తన కారు డిక్కీలో పెట్టుకుని నేరుగా బన్నేరుఘట్ట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ అతను పోలీసుల ఎదుట తాను చేసిన హత్యను ఒప్పుకుని లొంగిపోయాడు. మొదట శ్రీనివాస్‌ మృతదేహాన్ని ఎక్కడో ఒకచోట పడేసి పారిపోవాలని ప్లాన్‌ చేశాడు. కానీ ఆ తర్వాత భయపడి నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న బన్నేరుఘట్ట పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement