మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించిన సభ
పలుపార్టీల మద్దతు.. చర్చలో పాల్లొన్న 19 మంది ఎంపీలు
బీజేపీ యూజ్ అండ్ త్రో పాలసీపై అప్రమత్తంగా ఉండాలన్న తృణమూల్, ఆప్ ఎంపీలు
రాజధానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో స్పష్టత ఎక్కడన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్
రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లు..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రపదేశ్ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు–2026 గురువారం రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. బిల్లుకు బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్, బీఆర్‌ఎస్, బీజేడీ, ఆప్, జేడీయూ సహా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. రెండు గంటల చర్చ అనంతరం ఈ బిల్లుకు సభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం దక్కినట్లయింది.
లోక్‌సభలో బుధవారం ఆమోదం పొందిన బిల్లును గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు ముగిశాక ప్రవేశపెట్టారు. బిల్లుపై మొత్తం 19 మంది ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లులో అనేక అంశాలపై స్పష్టత లేదంటూ, బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ సభ నుంచి వాకౌట్ చేసింది.
వాడుకొని వదిలేయడం బీజేపీకి అలవాటన్న విపక్షాలు...
బిల్లుపై మాట్లాడిన అన్ని పార్టీలు ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం అందించే సాయం, ఎప్పటిలోగా నిర్మాణం పూర్తి చేస్తాయో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాయి. రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకునే ప్రక్రియ, పరిహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేయాలని కోరాయి. తన అవసరానికి ప్రాంతీయ పార్టీలను వాడుకొని వదిలేయడం బీజేపీకి అలవాటని, వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించాయి.
విభజన జరిగి పదేళ్లయినా ఇంతవరకు ఏపీ, తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని, కడప స్టీల్ ప్లాంట్, తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తి చేయలేదని ఎంపీలు పేర్కొన్నారు. ఈ దృష్ట్యా అమరావతిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కేంద్రం నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తృణమూల్ ఎంపీ మహ్మద్ నదీముల్ హక్ మాట్లాడుతూ, ‘బిహార్‌లో జేడీయూ నితీశ్‌కుమార్‌కు, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేకి ఏమి జరుగుతుందో చూస్తున్నారు.
వాడుకొని వదిలేయడం (యూజ్ అండ్ త్రో పాలసీ) బీజేపీ విధానం. కావున టీడీపీ అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ మాట్లాడుతూ, ‘కేంద్రంలోని బీజేపీ వైఎస్సార్‌సీపీకి మూడు రాజధానులు చేయమని ప్రోత్సహించింది.అమరావతిని రాజధాని చేయమని టీడీపీకి చెబుతోంది. బీజేపీతో జాగ్రత్త..చాలా పార్టీలను మోసం చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. కావున జాగ్రత్త’ అంటూ హితవు పలికారు. బీజేడీ తరఫున మాట్లాడిన నిరంజన్ బిషీ..పోలవరంతో ఒడిశాలో ముంపుపై సమగ్ర అధ్యయనం జరగాలని, నిరాశ్రయులకు సరైన పరిహారం ఇచ్చేలా చూడాలని కోరారు.
ఇక ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. ‘అమరావతిని మేమెన్నడూ వ్యతిరేకించలేదు. కానీ ఇప్పటికే 50వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క శాశ్వత భవనాన్ని నిర్మించలేదు. అలాంటి రాజధానిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారు. నిర్మాణం పూర్తయ్యేందుకు అవసరమయ్యే రూ.2లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్న దానిపై స్పష్టత లేదు’ అని వైఎస్సార్‌సీపీ తరఫున మాట్లాడిన పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
రాష్ట్రపతి పరిశీలనకు బిల్లు..
బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం మంత్రి నిత్యానంద్ రాయ్ సభకు బిల్లు వివరాలు వెల్లడించారు. అనంతరం బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం లభించడంతో తదుపరి ఆమోదానికి బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు.


