
సాక్షి, న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు న్యాయవాదుల నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. న్యాయవాదులు అమితాభ్ కుమార్ రాయ్, రాజీవ్ లోచన్ శుక్లాలను న్యాయమూర్తులుగా నోటిఫై చేస్తూ శనివారం కేంద్ర న్యాయశాఖ ఒక ప్రకటన జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం మార్చి 25న ఇద్దరు న్యాయవాదుల పేర్లను న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది.
అలహాబాద్ హైకోర్టులో గరిష్టంగా మొత్తంగా 160 న్యాయమూర్తుల పోస్టులకు రాజ్యాంగం అనుమతిస్తోంది. కానీ ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ భన్సాల్ సహా కేవలం 85 న్యాయమూర్తులే సేవలందిస్తున్నారు. దీంతో న్యాయ వితరణ తీవ్ర జాప్యం అవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం మొత్తం 26 మంది పేర్లను హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు చేసింది. వీరిలో 14 మంది న్యాయాధికారులు కాగా, 12 మంది న్యాయవాదులు ఉన్నారు. అందులో నలుగురు మహిళలు సైతం ఉన్నారు