
దేశానికే ట్రాఫిక్ పాఠాలు నేర్పుతున్న ఐజోల్ సిటీ
స్వీయ క్రమశిక్షణ, స్వయం నియంత్రణలో ఆదర్శం
‘సైలెంట్ సిటీ ఆఫ్ ఇండియా’గా పేరు
ఇంతకాలం విమానంలో తప్ప నేరుగా రవాణా వసతి నామమాత్రం
ఐజోల్‌కు అందుబాటులో రైల్వే వసతి
ఆ ప్రాంతం పేరు జొకోసంగ్.. నగరంలోని అతి ప్రధాన రోడ్డు.. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అధికంగా ఉండటంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒకవైపు వెళ్లే ట్రాఫిక్ అధికంగా ఉంది.. ఆ వైపు వాహనాలు నిలిచి పెద్ద వరస ఏర్పడింది.. మరోవైపు మాత్రం రోడ్డు ఖాళీగా ఉంది.. కానీ రోడ్డు మధ్యలో డివైడర్ లేకున్నా.. ఒక్క వాహనం కూడా గీత దాటలేదు.
ఆ నగర పర్యటనకు వచ్చిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల బృందం ఈ దృశ్యాన్ని చూసి అశ్చర్యపోయింది. ప్రజల్లో ఆ పరిణతికి అభినందనలు అంటూ నగర మేయర్‌కు లేఖ రాసింది. ఆ సిటీని చూసి నేర్చుకోండి అంటూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు సచిత్ర లేఖ పంపింది. ఆ నగరమే ఈశాన్య రాష్ట్రమైన మిజోరం రాజధాని
ఐజోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐజోల్ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు.. కానీ, కూడళ్లలో వాహనాలు అదుపు తప్పవు. రాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు లేనప్పటికీ వాహనాలు నియంత్రణ కోల్పోవు. రోడ్డు మీద వందల సంఖ్యలో వాహనాలు ముందుకు సాగుతున్నా.. ఎక్కడా హారన్లు వినపడవు, వాహనాలు ఒకదాని వెనక ఒకటి వరస కట్టి వెళ్తాయే తప్ప ఓవర్‌టేక్ చేయవు.. డ్రైవర్లు పరస్పరం అరుచుకోవటం, తిట్టుకోవటం మచ్చుకు కూడా కనిపించవు.. పాదచారులు ఫుట్‌పాత్‌ల మీదుగా మాత్రమే నడుస్తారు, అర్ధరాత్రి వేళ రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు కూడా రోడ్లమీదుగా నడవరు. ఇవన్నీ నమ్మశక్యం కాని నిజాలు. ఐజోల్ నగరంలో ఏ మూలకెళ్లినా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి.
ప్రకృతి ఒడిలో కొలువై.. కొండలు, లోయలు, దట్టమైన అడవులు, నదులు, వాగులు వంకలు.. స్వచ్ఛమైన ప్రకృతిలో కొలువైన ఆ నగరంలో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. దాదాపు 2.20 లక్షల వాహనాలున్నప్పటికీ హారన్ల మోతలు లేకపోవటంతో శబ్ద కాలుష్యం ఉండదు. ఇది స్థానికుల క్రమశిక్షణ ఫలితం. అందుకే ఐజోల్ నగరాన్ని ‘ది సైలెంట్ సిటీ ఆఫ్ ఇండియా’అంటారు.
ఇక్కడి ప్రజల్లో స్వీయ క్రమశిక్షణ పుట్టుకతో వస్తుందని అంటున్నారు. 4.21 లక్షల జనాభా ఉన్న నగరంలో నేరాలు అతి తక్కువ. మద్య నిషేధం కట్టుదిట్టంగా అమలవుతుండటంతో ప్రశాంతత రాజ్యమేలుతోంది. ప్రభుత్వ నిబంధనలు తు.చ.తప్పకుండా పాటిస్తున్న ప్రజలు, ఎలాంటి ఉల్లంఘనలకు ఆసక్తి చూపరు. దీంతో ఆ నగరంలో ప్రజల క్రమశిక్షణపై అధ్యయనానికి దేశంలోని చాలా నగరాలు ఆసక్తి చూపుతున్నాయి.
ఇంతకాలం విమానయానంతోనే..
ఐజోల్‌కు వెళ్లాలంటే ఇంతకాలం విమానయానమే అవకాశంగా ఉంది. అది ఖర్చుతో కూడుకున్నది కావటంతో చాలామంది అక్కడికి వెళ్లలేకపోయారు. ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలతో శనివారం నుంచి రైల్వే అనుసంధానం అందుబాటులోకి రావడంతో అధ్యయనాల కోసం నగరానికి వచ్చే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
కొండలతో కూడుకున్న ప్రాంతం కావటంతో విశాలమైన రోడ్ల నిర్మాణానికి వీలులేదు. కొండ అంచుల్లో వెనకవైపు లోయల్లోకి పిల్లర్లు ఏర్పాటు చేసి వాటి ఆధారంగా ఇళ్లను నిర్మిస్తుంటారు. ఉన్న కాస్త స్థలంలో 30 అడుగుల వెడల్పు రోడ్లు మాత్రమే ఉంటాయి. దీంతో ప్రజలు ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా క్రమశిక్షణతో రోడ్లను వాడుకుంటున్నారు. రోడ్లపై డివైడర్లు ఉండవు, కేవలం ట్రాఫిక్ లైన్స్‌మాత్రమే గీసి ఉంటాయి.
అయినా.. ఓ వైపు ఉన్న వాహనం ఎట్టి పరిస్థితిలో గీత దాటి మరోవైపు వెళ్లదు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు మాన్యువల్‌గా మాత్రమే ట్రాఫిక్ నియంత్రిస్తుంటారు. వారు చేయి ఎత్తగానే ఠక్కున వాహనాలు నిలిచిపోతాయి. ముందు వాహనాలు మందగమనంతో సాగినా వెనక వాహనదారులు పొరపాటున కూడా హారన్ మోగించరు.
సారీ చెప్పి ఓవర్‌టేకింగ్..
» ఎవరైనా అత్యవసరంగా ముందుకు సాగాల్సి ఉంటే, వాహనాలను ఓవర్‌టేక్ చేసి పక్క వాహనదారుకు సారీ చెప్పి మరీ వెళ్లటం అక్కడి ప్రత్యేకత. రాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు లేని సమయంలో కూడా కూడళ్లలో వాహనదారులు నియంత్రణ కోల్పోరు.
» ఘాట్ రోడ్లు కావటంతో అన్నీ మలుపులు తిరిగిన రోడ్లే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా హారన్ల మోత వినిపించదు. మరీ షార్ప్ కర్వ్ ఉండి, భారీ వాహనాలు వచ్చే రోడ్డయితే స్వల్పంగా ఒకసారి హారన్ మోగిస్తారు.
» తక్కువ వెడల్పు రోడ్లే అయినా, అన్ని చోట్లా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు. పాదచారులు కచి్చతంగా ఫుట్‌పాత్‌పైనే నడుస్తారు. అర్ధరాత్రి వేళ రోడ్లు ఖాళీగా ఉన్నా.. ఫుట్‌పాత్‌ల గుండానే ముందుకు సాగుతారు.
» టాక్సీలకు రోడ్ల మీదే పార్కింగ్ కల్పించారు. వాటికి 20 శాతం స్థలం ఉంటుంది. అవి వరసగా ఆగి ఉన్నా.. పక్కనుంచి మిగతా వాహనాలు ప్రశాంతంగా ముందుకు సాగిపోతుంటాయి.
» ఫుట్‌పాత్‌ల వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు, పార్కింగ్, హారన్లు మోగించకపోవటం, అక్రమ నిర్మాణాలు రాకుండా నియంత్రించటం.. తదితర అంశాలపై పాఠశాలల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించటం అక్కడి ప్రభుత్వాలు నిరంతరం కొనసాగిస్తున్నాయి.