Ahmedabad: ఒక ఆడియో.. పలు ప్రశ్నలు | Air India crash report shows pilot confusion over engine switch movement | Sakshi
Sakshi News home page

Ahmedabad: ఒక ఆడియో.. పలు ప్రశ్నలు

Jul 13 2025 1:29 AM | Updated on Jul 13 2025 6:17 AM

Air India crash report shows pilot confusion over engine switch movement

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో మరిన్ని చిక్కుముడులు

ఉద్దేశపూర్వకంగా ఫ్యూయల్‌ స్విచ్‌ను ఆఫ్‌ చేశారా? 

తరువాత గమనించి మళ్లీ వెంటనే ఆన్‌ చేశారా? 

పూర్తి ఆడియో విడుదల చేయకపోవడంపై అనుమానాలు

వారాల తరబడి వేచి ఉన్నాక, ప్రాథమిక దర్యాప్తు జరిగాక నివేదిక వెలువడితే ఆ విమానప్రమాద రహస్యాలు బయటికొస్తాయని అందరూ ఆశించారు. అయితే జూన్‌ 12న జరిగిన అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటన తాలూకు నివేదిక అందుకు భిన్నంగా మరిన్ని చిక్కుముడులు వేసేలా వెలువడటం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. 

విమానం ట్యాక్సీ స్థలం నుంచి మొదలై రన్‌వేపై పరుగెత్తి ఆకాశంలోకి ఎగిరేదాకా పైలట్ల సంభాషణలు రికార్డయితే కేవలం ఒకటి, రెండు వాక్యాలు మాత్రమే పొడిపొడిగా దర్యాప్తులో ప్రస్తావించడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆ వాక్యాలు కూడా పైలట్ల స్రత్పవర్తనను ప్రశ్నించేలా, వారి అంకితభావంపై అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. ]

ఫ్యూయల్‌ స్విచ్‌ను ఎందుకు ఆఫ్‌ చేశావని ఒక పైలట్‌ను మరో పైలట్‌ అడగటం చూస్తుంటే మొదటి పైలట్‌ ఉద్దేశపూర్వకంగానే స్విచాఫ్‌ చేశాడనే అనుమానం రేకెత్తుతోంది. అయితే తాను స్విచాఫ్‌ చేయలేదని అతని కరాఖండీగా చెప్పడం, వెనువెంటనే ఇద్దరూ స్విచ్‌ ఆన్‌కు ప్రయత్నించడం చూస్తుంటే ఆ స్విచ్‌లలోనే ఏవైనా మెకానిక్, ఎలక్ట్రిక్‌ లోపాలు ఉండొచ్చనే అనుమానాలూ బలపడుతున్నాయి. 

అయితే స్విచింగ్‌ వ్యవస్థలో లోపాలు ఉన్నాయో లేదో ప్రాథమిక నివేదికలో పేర్కొనకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అయితే స్విచాఫ్‌ చేయడాన్ని గమనించి పైలట్‌ ఇంకొరిని ప్రశ్నించాడా ? అనేది తేలాల్సి ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాక్‌ ప్రతీకార చర్యల్లో భాగంగా సరిహద్దు సమీప రాష్ట్రాల గగనతలాలపై ఎగిరే విమానాల కోఆర్డినేట్స్‌ను మార్చి, కూల్చేసేందుకు పాక్‌ సైబర్‌ దాడులను యత్నిస్తోందన్న కథనాల నడుమ ఈ నివేదిక విడుదలైంది. 

అయితే ఫ్యూయల్‌ స్విచ్‌ను ఎందుకు ఆఫ్‌ చేశావని ప్రశ్నించిన పైలట్‌ పేరును నివేదికలో బహిర్గతం చేయకపోవడం వెనుక ఆంతర్యమేముందని పలువురు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పైలట్‌ల పూర్వచరిత్రపై కూపీలాగేందుకు, ఆ దిశగా దర్యాప్తు సజావుగా సాగాలని ఉద్దేశంతోనే వాళ్ల ఐడెంటిటీనీ ప్రభుత్వం బయటపెట్టలేదనే వాదనను అంతర్జాతీయ మీడియా తెరమీదకు తెచ్చింది. అయితే పైలట్లను ఈ నివేదిక ఎక్కడా తప్పుబట్టకపోవడం విశేషం. 

అలా అని ఇది పూర్తిగా మెకానికల్, ఎలక్ట్రికల్‌ సమస్య కారణంగా జరిగిందనీ పేర్కొనలేదు. ప్రభుత్వం ఫ్యూయల్‌ స్విచ్‌లు ఆఫ్‌ అయ్యాయని మాత్రమే ప్రస్తావించి అక్కడితో ముగించింది. కానీ ప్రజల్లో మాత్రం కొత్త ప్రశ్నల పరంపరకు పరోక్షంగా నాంది పలికింది. స్విచ్‌లను పొరపాటున ఆఫ్‌ చేశారా? లేదంటే స్విచింగ్‌ లోపాలా అనేది నివేదిక స్పష్టంగా పేర్కొనలేదు. దీంతో అసలు కారణం ఏమిటనే మిస్టరీ అలాగే మిగిలిపోయింది. 

మెకానికల్, ఎలక్ట్రికల్‌ సమస్యలే కారణమా? 
విమానం సెకన్ల వ్యవధిలో నేలరాలడానికి మెకానికల్, ఎలక్ట్రికల్‌ సమస్యలే కారణమై ఉంటాయని పలువురు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కడే పైలట్‌ ఈ రెండు ఫ్యూయల్‌ స్విచ్‌లను ఒకేసారి ఆఫ్‌ చేయడం అసాధ్యమని కెనడాకు చెందిన విమాన ప్రమాదాల దర్యాప్తు అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ఫ్యూయల్‌ స్విచ్‌లను పొరపాటున ఆన్, ఆఫ్‌ చేయడం అంత సులభంకాదు. వీటికి లీవర్‌–లాక్‌లు ఉంటాయి.

 స్విచ్‌ను ఆన్‌ లేదా ఆఫ్‌ చేయాలంటే మొదటగా అక్కడున్న లీవర్‌ను పైకి లాగాల్సి ఉంటుంది. 1950వ దశకం నుంచే ఈ భద్రతా ఫీచర్‌ ఉంది. ఇవికాకుండా ప్రొటెక్టివ్‌ గార్డ్‌ బ్రాకెట్స్‌ అనేవి కూడా ఉంటాయి. పొరపాటున స్విచ్‌లు ఆన్‌/ఆఫ్‌ కాకుండా వాటిని ఈ బ్రాకెట్లు నిరోధిస్తాయి. ఈ లెక్కన ఒక్క చేతితో రెండు స్విచ్‌ల లీవర్‌లను ఒకేసారి పైకిలాగడం అసాధ్యం. పొరపాటున లాగారని భావించినా ఒకేసారి రెండింటినీ ఎవరూ లాగరు. ఈ లెక్కన వాటి పొజిషన్‌ను మార్చకపోయినా మెకానికల్, ఎలక్ట్రికల్‌ సమస్యల కారణంగా వాటి పొజిషన్‌ మారి ఉంటుంది’’అని ఆ నిపుణుడు వివరించారు.  

737 మోడల్‌లో లాకింగ్‌ ఫీచర్‌లో సమస్యలు! 
బోయింగ్‌ 737 రకం విమానాల్లో అమర్చిన ఫ్యూయల్‌ స్విచ్‌లకు లాకింగ్‌ వ్యవస్థ సరిగా అనుసంధానం కాలేదన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని యూఎస్‌ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సంస్థ స్పెషల్‌ ఎయిర్‌వర్తీ ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌ను 2018 డిసెంబర్‌లో విడుదలచేసింది. 

అందులో బోయింగ్‌ 737లోని ఫ్యూయల్‌ స్విచ్‌లతో లాకింగ్‌ ఫీచర్‌ సరిగా అనుసంధానం కావట్లేదని, అత్యవసర సమయాల్లో పనిచేయకపోవచ్చని, ఎప్పటికప్పుడు చెక్‌చేసుకుంటే మంచిదని సంస్థ తన అడ్వైజరీలో పేర్కొంది. అయితే ఈ సిఫార్సును ఏ విమానసంస్థ అయినా పట్టించుకుందో లేదో ఎవరికీ తెలీదు. అయితే ఇదే స్విచ్‌ డిజైన్‌ను బోయింగ్‌ 787–8 రకం విమానాల్లోనూ ఉపయోగించారు. అహ్మదాబాద్‌లో కూలిన వీటీ–ఏఎన్‌బీ విమానం ఈ రకానికి చెందినదే. అందుకే మీ వద్ద ఉన్న ఈ రకం విమానాలను స్వీయ తనిఖీ చేసుకుంటే బాగుంటుందని సిఫార్సుచేసింది. అయితే తనిఖీలకు ఎయిర్‌ఇండియా ఒప్పుకోలేదని తెలుస్తోంది.  

మొత్తం ఆడియో ఎందుకు బయటపెట్టలేదు? 
నువ్వెందుకు స్విచ్‌ ఆఫ్‌ చేశావని ఒక పైలెట్‌ను మరో పైలట్‌ అడగడం, నేను ఆఫ్‌చేయలేదని అతను బదులివ్వడం తప్పితే మరే ఇతర ఆడియో వివరాలు బహిర్గతం చేయకపోవడం సైతం అనుమానాలకు తావిస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. ‘‘విమానం ట్యాక్సీ స్థలం నుంచి మొదలై రన్‌వే అటు కొనకు చేరుకుని రన్‌వేపై ప్రయాణించి, గాల్లోకి లేచి, కూలిపోయే చిట్టచివరి సెకన్‌ దాకా ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణ మొత్తం రికార్డ్‌ అయంది.

 అలాంటప్పుడు మొత్తం ఆడియోను విడుదలచేస్తే నిపుణులు విశ్లేషించి ప్రమాదంపై ఓ అంచనాకు రాగలరు. వాళ్ల పరస్పర మాటలు, వాగ్వాదం లాంటివి వినగల్గితే స్విఛ్‌లు ఆఫ్‌ కావడం అనేది మానవతప్పిదమా? ఉద్దేశపూర్వకమా? లేదంటే అవి పాడైపోవడంతో పనిచేయడం మానేశాయా? అనేవి స్పష్టంగా తెలుస్తాయి’’అని అమెరికా నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీటర్‌ గోయెల్జ్‌ చెప్పారు.  

ఏమిటీ ఇంధన స్విచ్‌లు 
విమానంలో ఇంజన్లకు సరఫరా చేసే ఇంధనాన్ని కాక్‌పిట్‌లోని ‘ఫ్యూయల్‌ కంట్రోల్‌ స్విచ్‌’లతోనే నియంత్రిస్తుంటారు. టేకాఫ్, ల్యాండింగ్‌ సమయంలో ఇవే అత్యంత కీలకం. ఇంజన్‌ విఫలమైతే మాన్యువల్‌గా రీస్టార్ట్, లేదా షట్‌డౌన్‌ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. టేకాఫ్‌ సయయంలో స్విచ్‌లను అచేతనావస్థలో (ఆఫ్‌ చేసి) ఉంచడం అత్యంత అసాధారణమని నిపుణులు చెబుతున్నారు. అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదానికి ఇదే కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు.

నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం 
నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్‌
ముంబై: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు జరిగిన తీరు, నివేదికలో ప్రస్తావించిన కొన్ని అంశాలు పైలెట్లదే తప్పు అనే అర్థం గోచరించేలా ఉన్నాయని భారతీయ ఎయిర్‌లైన్‌ పైలెట్ల సంఘం(ఏఎల్‌పీఏ) వ్యాఖ్యానించింది. నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు కొనసాగించాలని ఏఎల్‌పీఏ అధ్యక్షుడు కెప్టెన్‌ శ్యామ్‌ థామస్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 

‘‘పైలెట్లదే తప్పు అని తేల్చేలా దర్యాప్తు జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రాథమిక దశలోనే ఇలాంటి నిర్ణయానికి రావడం విచారకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పైగా దర్యాప్తులో ఇంత గోప్యత ఎందుకు? ఇంత కీలకమైన కేసు దర్యాప్తు బృందంలో పైలట్ల రంగం నుంచి నిపుణులకు చోటివ్వకపోవడం శోచనీయం. కనీసం పరిశీలకులుగా అయినా పైలట్ల సంఘ ప్రతినిధులకు అవకాశం కల్పించాలి. అప్పుడే దర్యాప్తులో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటాయి. 

ఫ్యూయల్‌ స్విచ్‌ గేట్స్‌ వంటి కీలక మెకానికల్, ఎలక్ట్రిక్‌ ఉపకరణాల వ్యవస్థలో లోపాలు ఉండొచ్చని ఆరోపణలున్నాయి. అవి సరిగా ఉన్నదీ లేనిదీ విమానం బయల్దేరే ముందే తనిఖీలు చేశారా? ఫ్యూయల్‌ కంట్రోల్‌ స్విచ్‌ల పొజిషన్లు మారడం సైతం ప్రమాదానికి కారణం కావచ్చని అమెరికాలోని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. భారత్‌లో దర్యాప్తు జరుగుతుండగా, ప్రాథమిక దర్యాప్తు నివేదిక అధికారికంగా విడుదల కాకముందే అందులోని అంశాలు ఎలా లీకయ్యాయి?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

ఎల్రక్టానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌లో సమస్య ఉందా? 
‘‘విమానంలో ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌ అనేది కీలకం. ఈ ప్రమాదం విషయంలో ఎల్రక్టానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌ పాత్ర ఏమిటి అనేది ఎక్కడా పేర్కనలేదు. పైలట్‌ ప్రమేయం లేకుండా ఎల్రక్టానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌లో సమస్య కారణంగా ఫ్యూయల్‌ స్విచ్‌ పొజిషన్‌ మారిందా లేదా అనేది తెలియల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఎల్రక్టానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌ స్తంభించిపోవడం అనే అంశంపై తీవ్రంగా దృష్టిసారించాల్సిందే’’అని భారత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో మాజీ దర్యాప్తు నిపుణుడు కెపె్టన్‌ కిశోర్‌ చింతా అన్నారు. ‘‘ఇంజిన్లు ఆగిపోవడంతో వెంటనే మొదటి ఇంజిన్‌ను స్టార్ట్‌ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు.

 అది నెమ్మదిగా శక్తిని అందుకుంటోంది. రెండో ఇంజిన్‌నూ స్టార్ట్‌చేశారు. అది మరింత నెమ్మదిగా శక్తిని అందుకుంటోంది. పైలట్లు దురుద్దేశంతో ఇంజిన్లను ఆఫ్‌ చేస్తే మళ్లీ ఆన్‌ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదు. కానీ వాళ్లు వెంటనే ఆన్‌ పొజిషన్‌కు మార్చారు. విమానాన్ని తిరిగి తమ అ«దీనంలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ లెక్కన స్విచాఫ్‌లో వాళ్ల ప్రమేయం లేదని ఊహించుకోవచ్చు’’అని మరో నిపుణుడు వ్యాఖ్యానించారు. ఈ విమానంలో ఫ్యూయల్‌ స్విచ్‌లు గతంలో ఏమైనా పాడయ్యాయా? రిపేర్‌ చేశారా? కొత్తవి బిగించారా? అనే వివరాలు నివేదికలో లేకపోవడం సైతం ఫ్యూయల్‌ స్విచ్‌ల నాణ్యతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

    – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement