అన్నాడీఎంకే అంతర్గత సంక్షోభం కీలక మలుపు తిరిగింది. ఎన్నికల అనంతరం పార్టీ లోపల మొదలైన విభేదాలు ఇప్పుడు రాజీ, పునఃసమీకరణల దిశగా కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఇచ్చిన పిటిషన్‌ను వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో “తమదే అసలైన అన్నాడీఎంకే వర్గం” అంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన రెబల్ శిబిరం కూడా వెనక్కి తగ్గే దిశగా అడుగులు వేస్తోంది.
ఇటీవల స్పీకర్‌ను కలిసిన ఈపీఎస్.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని, అలాగే టీవీకేలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారడం మొదలైంది. రెబల్ వర్గంలో సంఖ్యా బలం క్రమంగా తగ్గిపోవడం, పలువురు ఎమ్మెల్యేలు తిరిగి ఈపీఎస్ వైపు మొగ్గు చూపడం ఈ పరిణామాలకు కారణంగా కనిపిస్తోంది.
ఎన్నికల తర్వాత సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి, విజయ్‌భాస్కర్ నేతృత్వంలో ఏర్పడిన రెబల్ వర్గం మొదట తమ బలం 30 మంది ఎమ్మెల్యేలని ప్రకటించింది. అయితే అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వ బలనిరూపణ సమయానికి ఆ సంఖ్య 25కు చేరింది. ఇప్పుడు వరుస పరిణామాల తర్వాత ఆ సంఖ్య 16కి పడిపోయిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రెబల్ వర్గ భవిష్యత్తుపై అనుమానాలు మొదలయ్యాయి.
బలపరీక్ష సమయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి రెబల్స్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మద్దతుకు ప్రతిఫలంగా కేబినెట్‌లో కీలక మంత్రి పదవులు దక్కుతాయని ఆ వర్గం ఆశించినట్లు తెలుస్తోంది. కానీ టీవీకే మిత్రపక్షాల అభ్యంతరాలతో అది జరగలేదు. అయితే రాజకీయ ప్రాధాన్యం రాకపోవడంతో అసంతృప్తి పెరిగినట్లు సమాచారం. భవిష్యత్‌లో పార్టీలో స్థానం, పదవుల పునరుద్ధరణ, రాజకీయ భద్రత వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తిరిగి ఈపీఎస్ శిబిరం వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే కొందరు రెబల్ ఎమ్మెల్యేలు తమ నిర్ణయాలను మార్చుకుని ఈపీఎస్‌కు చేరువవుతున్నారు. మరోవైపు టీవీకే వైపు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి అధికారికంగా విజయ్ శిబిరంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరికి భవిష్యత్ ఉపఎన్నికల్లో టీవీకే తరఫున అవకాశాలు ఇవ్వొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.
ఈ పరిణామాలన్నింటి మధ్య ఈపీఎస్ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదట కఠిన వైఖరి తీసుకున్న ఆయన.. ఇప్పుడు రాజీ ఫార్ములాతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రెబల్స్‌పై చర్యల పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం ద్వారా అసంతృప్త వర్గాలను తిరిగి పార్టీలో కలుపుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ మరోసారి ఏకీకృతం కావచ్చన్న చర్చ మొదలైంది.
అయితే ఇదంతా జరుగుతున్నప్పటికీ విజయ్ ప్రభుత్వానికి తక్షణ ప్రమాదం ఏమీ లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అసెంబ్లీలో 144-22 తేడాతో విజయ్ ప్రభుత్వం బలనిరూపణలో విజయం సాధించింది. కాబట్టి రెబల్స్ మద్దతు ఉపసంహరించుకున్నా(మ్యాజిక్ ఫిగర్ 118) ప్రభుత్వ స్థిరత్వంపై పెద్దగా ప్రభావం ఉండదని చెబుతున్నారు. కానీ ఈ పరిణామాలు భవిష్యత్ రాజకీయ సమీకరణాలను మాత్రం పూర్తిగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మొత్తంగా చూస్తే… అన్నాడీఎంకేలో మొదలైన అంతర్గత పోరు ఇప్పుడు రాజకీయ పునర్వ్యవస్థీకరణ దిశగా సాగుతోంది. రెబల్ వర్గం బలహీనపడుతుండగా, ఈపీఎస్ మళ్లీ పార్టీపై పట్టు బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో విజయ్ టీవీకే చుట్టూ తిరుగుతున్న రాజకీయ లెక్కలు తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త సమీకరణానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


