నిన్న తమిళనాడు.. ఇవాళ కర్ణాటకలో ‘గవర్నర్‌ ట్విస్ట్‌’ | Karnataka Power Shift Gets New Twist As Governor Leaves For Mumbai Amid CM Change Buzz, Check More Details Inside | Sakshi
Sakshi News home page

నిన్న తమిళనాడు.. ఇవాళ కర్ణాటకలో ‘గవర్నర్‌ ట్విస్ట్‌’

May 28 2026 8:27 AM | Updated on May 28 2026 10:04 AM

After Tamil Nadu Governor Row Now New Twist In Karnataka Politics

కర్ణాటకలో సీఎం మార్పు చుట్టూ ఇప్పటికే రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరగా.. ఇప్పుడు గవర్నర్‌ ఎంట్రీ మరో కొత్త ట్విస్ట్‌కు దారి తీసింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేసే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ.. కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ వ్యక్తిగత పనులపై ముంబై వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. 

సీఎం కార్యాలయం ఇప్పటికే గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు సమాచారం రావడం.. మరోవైపు గవర్నర్‌ తిరుగు ప్రయాణ టికెట్‌ కూడా ఇంకా బుక్‌ చేయలేదన్న వార్తలు బయటకు రావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. కాంగ్రెస్‌ వర్గాలు మాత్రం గవర్నర్‌ అందుబాటులో లేకపోయినా సిద్దరామయ్య రాజీనామా చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ కార్యదర్శిని కలిసి రాజీనామా లేఖ సమర్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. 

రాజీనామా ప్రక్రియ, తదుపరి ప్రభుత్వ ఏర్పాటు, డీకే శివకుమార్‌కు ఆహ్వానం వంటి అంశాల్లో ఆలస్యం జరిగితే రాజకీయంగా కొత్త సంక్షోభం తలెత్తొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్దరామయ్య-డీకే శివకుమార్‌ మధ్య అధికార సమీకరణాలపై గత కొన్ని నెలలుగా అంతర్గత పోరు కొనసాగుతోంది. అలాంటి సమయంలో గవర్నర్‌ అందుబాటులో లేకపోవడం, నిర్ణయాల్లో జాప్యం జరగడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.

ఇక్కడే మరో ఆసక్తికర పోలిక కూడా తెరపైకి వస్తోంది. ఇటీవల తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్‌ ఆర్‌వీ ఆర్లేకర్‌ వ్యవహారించిన తీరు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకేకు వెంటనే ఆహ్వానం ఇవ్వకుండా, పూర్తి మెజారిటీ లేదంటూ పలుమార్లు ఆలస్యం చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.

ఇప్పుడు కర్ణాటకలో కూడా అలాంటి రాజకీయ హైడ్రామా చోటుచేసుకునే అవకాశాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. గవర్నర్‌ వ్యవస్థను రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోందంటూ కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నాయి. కర్ణాటకలో కూడా అదే తరహా వ్యూహం అమలు చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవేళ సీఎం మార్పు ప్రక్రియలో ఆలస్యం జరిగితే.. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో డీకే శివకుమార్‌ వర్గం, సిద్దరామయ్య వర్గం మధ్య అసంతృప్తులు మరింత పెరిగే అవకాశమూ కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే.. గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఎప్పుడు తిరిగి వస్తారు? సిద్దరామయ్య నిజంగా ఎప్పుడు రాజీనామా చేస్తారు? డీకే శివకుమార్‌కు సీఎం బాధ్యతలు అప్పగింపు ఎప్పుడు జరుగుతుంది? అనే దానిపైనే నిలిచింది. కర్ణాటక రాజకీయాల్లో ఇప్పటికే వేడెక్కిన పవర్‌ గేమ్‌కు ఇప్పుడు ‘గవర్నర్‌ ట్విస్ట్‌’ మరింత హీట్‌ పెంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement