క్షేమంగా చేరుకున్న ‘నందాదేవి’ | After Shivalik and Nanda Devi tanker docks at Gujarat Vadinar Port after safe Hormuz transit | Sakshi
Sakshi News home page

క్షేమంగా చేరుకున్న ‘నందాదేవి’

Mar 18 2026 4:23 AM | Updated on Mar 18 2026 4:24 AM

After Shivalik and Nanda Devi tanker docks at Gujarat Vadinar Port after safe Hormuz transit

న్యూఢిల్లీ: ఇరాన్‌ దాడులతో ప్రమాదకరంగా పరిణమించిన హార్మూజ్‌ జలసంధి గుండా మరో ఎల్పీజీ ట్యాంకర్‌ సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రిదాటాక 2.30 గంటలకు ‘నందాదేవి’నౌక గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి చేరుకుందని కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్‌ మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సిన్హా చెప్పారు. సోమవారం తొలి నౌక శివాలిక్‌ గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌కు చేరుకున్న విషయం విదితమే. రెండు నౌకల ద్వారా మొత్తంగా 92,712 టన్నుల ఎల్పీజీ భారత్‌కు వచ్చింది.

ఇంతటి ఎల్పీజీ నిల్వ మొత్తం భారతదేశ ఒకరోజు అవసరాలకు సరిపోతాయి. ‘‘రెండు నౌకల నుంచి ఎల్పీజీ దిగుమతి ప్రక్రియ ఆరంభమైంది. గత 24 గంటల్లో భారతీయ నావికులు ఉన్న ఎలాంటి నౌక ఎలాంటి దాడి ఘటనలకు గురికాలేదు. మన నావికులంతా సురక్షితంగా ఉన్నారు. ఈ రెండు నౌకలు మార్చి 13వ తేదీన ఎల్పీజీ నింపుకుని బయల్దేరి మార్చి 14వ తేదీన ప్రమాదకర హార్మూజ్‌ను దాటాయి.

ఈ రెండింటితో కలిపి యుద్ధమయ పశ్చిమాసియా నుంచి భారత్‌కు క్షేమంగా చేరుకున్న నౌకల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఇంకా 22 భారతీయ జెండా ఉన్న నౌకలు పశ్చిమాసియాలో చిక్కుకుపోయాయి. వీటిల్లో మొత్తంగా 611 మంది భారతీయ నావికులు ఉన్నారు. నావికుల క్షేమ సమాచారం అందించేందుకు నౌకల యజమానులు, ఏజెన్సీలు, భారత హైకమిషన్లతో నిరంతరం సంప్రతింపులు జరుపుతున్నాం’’అని రాజేశ్‌ సిన్హా చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement