ఇలాంటిదేదో జరుగుద్దని ముందే ఊహించాం | Abhijeet Dipke Reacts After Cockroach Janta Party Retunrs On X, Gives Clarity On Foreign Accounts | Sakshi
Sakshi News home page

ఇలాంటిదేదో జరుగుద్దని ముందే ఊహించాం

May 22 2026 7:13 AM | Updated on May 22 2026 11:01 AM

Abhijeet Dipke On Cockroach Janta Party Back And Pak Members Clarity

న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యల నేపథ్యంలో గతవారం సోషల్‌ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన కాక్రోచ్‌ జనతా పార్టీ ‘ఎక్స్‌’ఖాతాను ప్రభుత్వం గురువారం నిలిపివేసింది. అయితే గంటల వ్యవధిలో ఆ పార్టీ ‘కాక్రోచెస్‌ డోంట్‌ డై’ట్యాగ్‌లైన్‌తో ‘కాక్రోచ్‌ ఈజ్‌ బ్యాక్‌’పేరిట మరోఖాతాను సృష్టించుకుంది. 

తమ ఖాతాను హ్యాక్‌ చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, నిలిపివేస్తారని కూడా ముందే ఊహించామని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే చెప్పారు. ఇది ప్రభుత్వం తనకు తాను చేసుకున్న తప్పిదం అని పేర్కొన్నారు. దీనిపై చట్టపరంగా పోరాడుతామని వెల్లడించారు. ‘కాక్రోచ్‌ ఈజ్‌ బ్యాక్‌’పేరుతో ‘ఎక్స్‌’లో కొత్త ఖాతా ప్రారంభించామని తెలిపారు. తమ ఖాతా, ఉద్యమం వేగంగా జనంలోకి చొచ్చుకెళ్తున్నాయని స్పష్టంచేశారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఖాతా ప్రారంభం కాగా.. మళ్లీ ఫాలోవర్స్‌ విషయంలో దూసుకుపోతోంది. 

అందుకే తప్పుడు ప్రచారం
తమ ఉద్యమాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఖాతాను నిలిపివేసిందని అభిజిత్‌ దీప్కే విమర్శించారు. అంతేకాదు.. సీజేపీ విషయంలో జరుగుతున్న ప్రచారంపైనా ఆయనో క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, టర్కీ లాంటి ఇస్లాం ప్రభావిత దేశాల నుంచే దానికి ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారని, ఫేక్‌.. బోట్‌(కంప్యూటర్‌ ఆపరేటెడ్‌) అకౌంట్లు ఉన్నాయని(కొందరు వీడియోలు పెట్టారు.. అవి ఫేక్‌ అని అభిజిత్‌ అంటున్నారు).. జనతా కాక్రోచ్‌ పార్టీ ప్రొపగాండ క్యాంపెయిన్‌ అని, తాను ఆప్‌ ఏజెంట్‌నని(అభిజిత్‌ దీప్కే గతంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ సోషల్‌ మీడియా టీంలో పని చేశారు), దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, ఇది ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చే విదేశీ కుట్ర వ్యవహారమంటూ జరుగుతున్న ప్రచారాలన్నింటినీ ఆయన ఖండించారు. ఒకవైపు నిరుద్యోగ యువత ఈ ఉద్యమంలో చేతులు కలుపుతుంటే.. పనికిమాలిన వాళ్లే అలాంటి ప్రచారాలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చాడు. 

https://pbs.twimg.com/media/HI1oaa5bQAAZmtF.jpg

 

 

ఇన్‌స్టాగ్రామ్‌లో 18 మిలియన్లు క్రాస్‌
ఉపాధి, ఉద్యోగాలు లేని యువత పరాన్నజీవులు, బొద్దింకల మాదిరిగా వ్యవస్థలపై దాడి చేస్తున్నారని జస్టిస్‌ సూర్యకాంత్‌ ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా ఆక్షేపించారు. దీనిపై నిరసన వ్యక్తంచేస్తూ అభిజిత్‌ దీప్కే కాక్రోచ్‌ జనతా పార్టీని ప్రారంభించారు. నిజానికి ఇదొక వ్యంగ్య డిజిటల్‌ పార్టీ. సోషల్‌ మీడియాలో యువత విపరీతంగా ఆకర్షితులయ్యారు. సామాజిక కార్యకర్తలు, కళాకారులు ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. పలు రాజకీయ పార్టీ నేతలు, మేధావులు కూడా అండగా నిలిచారు.  పార్టీ ‘ఎక్స్‌’ఖాతాకు ఫాలోవర్ల సంఖ్య లక్షల్లో చేరింది. ఇన్‌స్టా్రగామ్‌లో అనుసరించేవారి సంఖ్య 18 మిలియన్లు దాటేసింది. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.  ఈ విషయంలో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న కాంగ్రెస్‌, రెండో స్థానంలో ఉన్న బీజేపీలను సీజేపీ అధిగమించినట్లైంది. 

కాక్రోచ్‌ జనతా పార్టీ పదునైన రాజకీయ విమర్శలు, వ్యాఖ్యానం ద్వారా ఆదరణ పొందుతోంది. సమకాలీన అంశాలపై చర్చ.. నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీక్‌లు, విద్యా వ్యవస్థ తీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ప్రధానంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తోంది. అందుకే దీనికి దేశద్రోహి, ప్రభుత్వ వ్యతిరేక ముద్ర వేసి తిట్టి పోస్తున్నారు. అయితే వాళ్లకు స్వయంగా అభిజిత్‌ కౌంటర్‌ ఇస్తుండడం గమనార్హం. 

ఈ సమయంలో కాక్రోచ్‌ జనతా పారీ్టకి సంబంధించిన తొలి ‘ఎక్స్‌’ఖాతా గురువారం నుంచి నిలిచిపోవడం.. కాసేపటికే కొత్త అకౌంట్‌ ప్రత్యక్షం కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ‘ఎక్స్‌’లో ద కాక్రోచ్‌ యూత్, కాక్రోచ్‌ న్యూస్, ఐయామ్‌ కాక్రోచ్, కాక్రోచ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, కాక్రోచ్‌ జనతా పారీ్ట(జెన్‌ జెడ్‌) పేరిట ఖాతాలు చురుగ్గా పని చేస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement