మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి | 10 People Died In Bus Accident In Gondia District Of Maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి

Published Fri, Nov 29 2024 3:20 PM | Last Updated on Fri, Nov 29 2024 4:40 PM

10 People Died In Bus Accident In Gondia District Of Maharashtra

ముంబై : మహరాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. బస్సు బోల్తాపడి 10 ప్రయాణికులు మరణించారు. పలువురి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

బస్సు ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మహరాష్ట్ర స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌ పోర్ట్‌ కార్పేషన్‌(ఎంఎస్‌ఆర్‌టీసీ)కు చెందిన బస్సు శుక్రవారం మధ్యాహ్నం భండారా నుండి సకోలి మీదుగా గోండియా అనే ప్రాంతానికి వెళ్తుంది.

ఆ సమయంలో ఓ మలుపు వద్ద ఆర్టీసీ బస్సుకు అకస్మాత్తుగా ఓ ద్విచక్ర వాహనదారుడు ఎదురుగా వచ్చాడు. ఆకస్మిక పరిణామంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్‌ ప్రమాదం జరగకుండా బస్సును పక్కకి తిప్పాడు. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికుల్లో 10 మరణించారు. 

ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణ భయంతో బస్సు డ్రైవర్‌ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. బస్సు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, తోటి వాహనదారులు ప్రయాణికుల్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.

ప్రమాద బాధితులకు ఎక్స్‌ గ్రేషియా
బస్సు ప్రమాదంపై మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే విచారం వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు తక్షణమే రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించాలని రవాణా శాఖకు ఆదేశాలు జారీచేశారు.  

మృతుల కుటుంబ సభ్యులకు మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఎక్స్‌ వేదికగా ఆయన స్పందిస్తూ..‘గోండియా జిల్లాలోని సడక్ అర్జున్ సమీపంలో శివషాహి ఆర్టీసీ బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల మరణం నన్ను కలచి వేస్తుంది. మరణించిన వారికి నా నివాళి’అని తెలిపారు.  

‘ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని ఫడ్నవీస్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

గోండియా వద్ద అదుపు తప్పి తిరగబడిన బస్సు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement