నారాయణపేట: నర్వ మండలం సీపూర్‌కు చెందిన చంద్రశేఖర్ కుల ధ్రువీకరణ పత్రాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు డా. మంత్రి నరసింహయ్య డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రశేఖర్ 2022లో కన్వర్టెడ్ క్రిస్టియన్ బీసీ–సీ, 2025లో సర్పంచ్ ఎన్నికల సమయంలో ఎస్సీ మాదిగ కుల ధ్రువీకరణ పత్రం పొందినట్లు ఆరోపించారు. ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు కుల ధ్రువీకరణ పత్రాలు ఎలా జారీ అయ్యాయనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ విషయమై అదే గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు ఏప్రిల్ 10న కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారని వివరించారు. విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు కలెక్టర్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి సోమవారం ఆంజనేయులుకు ఎండార్స్‌మెంట్ అందినట్లు వివరించారు. అయితే కుల ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన రికార్డులు, సమర్పించిన ఆధారాలను అధికారులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని, వాటిని కూడా విచారణలో పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పాక్షికంగా విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలన్నారు. న్యాయం జరగకపోతే న్యాయపరమైన మార్గాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.


