నారాయణపేట: ప్రజావాణి ఫిర్యాదులకు తగిన ప్రాధాన్యతనిస్తూ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆర్డీఓ రమేష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను అధికారులకు వివరించి వినతులు సమర్పించారు. మొత్తం 20 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తలెత్తకుండా అర్జీలపై బాధ్యతాయుతంగా స్పందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


