గద్వాల: డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడిన సామాన్యులపై యూపీఐ చార్జీల భారం పడనుంది. రూ.2 వేల వరకు యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఉండదు. ఆపై జరిగే కొన్ని రకాల చెల్లింపులపై కనిష్టంగా రూ.12 నుంచి గరిష్టంగా రూ.300 వరకు చార్జీలు విధించనున్నారు. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంపై జనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో వివిధ రకాల లావాదేవీలు నెలకు సుమారు రూ.2,500–3,000 కోట్ల మేర జరుగుతున్నట్లు అంచనా. వీటిపై ఎస్‌ఎస్‌టీ, సీఎస్‌టీ తదితర పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే రూ.200–300 కోట్ల వరకు ఆదాయం సమకూరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ అమలుతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వానికి రూ.20 కోట్లకుపైగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల అంచనా. అయితే కొత్త చార్జీలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు సులభతరం కావడంతో నగదు అవసరం తగ్గిందని కొందరు చెబుతుండగా, అదనపు చార్జీల నేపథ్యంలో మళ్లీ నగదు చెల్లింపుల వైపు మళ్లే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు.
‘నగదు వద్దు.. డిజిటల్ ముద్దు’ అంటూ చెప్పి ఇప్పుడు భారం వేయొద్దు
యూపీఐ చార్జీల వడ్డనపై వినియోగదారులు, వ్యాపారుల్లో భిన్నాభిప్రాయాలు
ఎండీఆర్ అమలుతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వానికి రూ.20 కోట్లకుపైగా ఆదాయం


