● ఎస్సీ, ఎస్టీల దరఖాస్తులు
గౌరవంగా స్వీకరించాలి
● పెండింగ్ కేసులపై
ప్రత్యేక దృష్టి సారించాలి
● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య
నారాయణపేట: ఎస్సీ, ఎస్టీల సామాజిక, న్యాయప రమైన సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. బుధవారం జిల్లాకేంద్రానికి వచ్చిన కమిషన్ చైర్మన్‌కు కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డా. వినీత్ పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ల్యాండ్, సర్వీస్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఇతర న్యాయపరమైన అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశాలకు ఎస్‌ఐలు, తహసీల్దార్లు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రజలు తమ సమస్యలతో కార్యాలయాలకు వచ్చినప్పుడు గౌరవంగా ఆహ్వానించి పూర్తిగా తెలుసుకొని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి నెల చివరి వారంలో నిర్వహించే పౌరహక్కుల దినోత్సవానికి పోలీస్, రెవెన్యూ అధికారులు విధి గా హాజరుకావాలని.. మండలస్థాయిలో నెలవారీ సమీక్షలు, జిల్లాస్థాయిలో మూడునెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంపై పురోగతిని పరిశీలించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, విద్య, ఉపాధి పథకాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని.. పబ్లిక్ స్కూళ్లలో సీట్లు, ఉన్నత విద్య, విదేశీ విద్యకు ఆర్థిక సాయం, భూమి ఆధారిత పథకాలు తదితర వివరాలను అర్హులకు తెలియజేసి సద్వినియోగం చేసుకునేలా అధికారులు సహకరించాలని సూచించారు. రిజర్వేషన్ల అమలులో అవకతవకలకు ఆస్కారం లే కుండా అధికారులు పర్యవేక్షించాలని.. ఉప ప్రణాళిక నిధులను ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.
పెండింగ్ కేసులు పరిష్కరించాలి..
ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా చట్ట ప్రకారం దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని పోలీసు అధికారులను కోరారు. తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులను పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. జిల్లాలో సుమారు 26 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నట్లు అధికారులు చైర్మన్‌న్‌కు వివరించారు. రెండు మోడల్ స్కూళ్లు, 11 కేజీబీవీలు ఉన్నాయని తెలిపారు. గురుకులాలు, జ్యోతిరావు పూలే పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతిగృహాల వివరాలను సమర్పి ంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగం ప్రజలకు సేవ చేసే అవకాశమని.. మానవతా దృక్పథంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును పరిశీలించి సరైన మార్గనిర్దేశం చేయాలని అన్నారు. జిల్లా స్థాయిలోనే సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు రాష్ట్రస్థాయి కమిషన్‌ను ఆశ్రయించాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డా. వినీత్, కమిషనన్ సభ్యులు లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, ఆర్డీఓ రమేష్, శిక్షణ కలెక్టర్లు, డీఎస్పీ నల్లపు లింగయ్యతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, పుర కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


