నారాయణపేట రూరల్: మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసుకునే విద్యార్థుల సౌకర్యార్థం టాస్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డీటీఎఫ్ జిల్లా నాయకులు కోరారు. బుధవారం డీఈఓ గోవిందరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో సుమారు 400 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, వీరందరూ జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రానికి రావడానికి రవాణా పరంగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గతంలో మక్తల్‌లో పరీక్షా కేంద్రం ఉండేదని, రద్దు చేసిన పరీక్షా కేంద్రాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సూర్యచంద్ర, హైమావతి, అశోక్ పాల్గొన్నారు.
‘పారాక్వాట్’ కలుపు
మందుపై నిషేధం
నారాయణపేట: రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన జీఓఎంఎస్ నంబర్ 24 ప్రకారం ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారాక్వాట్ అనే కలుపు మందును రాష్ట్రంలో నిషేఽ దించినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్‌సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పారాక్వాట్ అత్యంత ప్రమాదకరమైన రసాయనం అని, పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా తాగితే ప్రాణాపాయం కలిగిస్తుందన్నారు. ఇందుకు సంబధించి ఇప్పటివరకు ఎటువంటి ప్రత్యేక వైద్యం లేదన్నారు. అదేవిధంగా దీర్ఘకాలికంగా వాడటం వలన క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతున్నట్లు శాసీ్త్రయంగా నిర్ధారించారని తెలిపారు. ఇప్పటి నుంచి పారాక్వాట్ నిల్వ చేయడం, విక్రయించడం, రవాణా చేయడం, వినియోగించడాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


