పేదోడి ఇంటికి ని‘బంధనాలు’
మద్దూరు: ఇందిరమ్మ ఇళ్లకు నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో అప్పులు చేసి మరీ నిర్మాణాలు ప్రారంభించారు. కానీ బిల్లుల చెల్లింపులో అధికారులు సవాలక్ష సాకులు చూపుతున్నారు. ఫలితంగా నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోతున్నాయి. అటు ఇంటి నిర్మాణం పూర్తిగాక.. ఇటు పెట్టుబడి పెట్టిన డబ్బులు రాక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం కూడా పూర్తయ్యేలా కనిపించడం లేదు.
జిల్లాకు 6,182 ఇళ్లు మంజూరు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకున్న అధికారులు.. సర్వే నిర్వహించి మరీ అర్హులను ఎంపిక చేశారు. మొదట ఇంటి స్థలం ఉన్న వారికే అవకాశం కల్పించారు. జిల్లాలోని 13 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో మొత్తం 6,182 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. అందులో ఇప్పటి వరకు 4,594 ఇళ్లకు మార్కింగ్ వేసి పనులను ప్రారంభించారు. అయితే కేవలం 5 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అధికారులు బిల్లులను నిలిపివేశారు. దీంతో ఆయా ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
నిబంధల ప్రకారంనిర్మించుకోవాలి..
జిల్లాలో నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు వెంటనే వస్తున్నాయి. గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి ప్రస్తుతం బిల్లులు చెల్లించడం కుదరడం లేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 600 అడుగుల చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టిన ఇళ్లకు కూడా బిల్లులు చెల్లించడం కుదరడం లేదు. ఇవి కొడంగల్ నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉన్నాయి.
– శంకర్‌నాయక్, హౌసింగ్ పీడీ
బిల్లులు రాక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అవస్థలు
గతంలోనే ఇల్లు మంజూరైందని.. సరైన పత్రాలు లేవంటూ సాకులు
ప్రభుత్వ నిబంధనలతో
లబ్ధిదారుల బేజారు
అసంపూర్తిగా నిలిచిపోతున్న పనులు
జిల్లాలో కేవలం
ఐదు నిర్మాణాలు మాత్రమే పూర్తి
పేదోడి ఇంటికి ని‘బంధనాలు’
పేదోడి ఇంటికి ని‘బంధనాలు’


