మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం
దేవరకద్ర: వానాకాలం పంటల దిగుబడి ప్రారంభం కావడంతో గురువారం దేవరకద్ర మార్కెట్‌కు ధాన్యం పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు కోతలు కోసిన వరి ధాన్యాన్ని అమ్మకానికి తేవడంతో మార్కెట్ అంతా ధాన్యం కుప్పలతో నిండిపోయింది. కోయిల్‌సాగర్ ఆయకట్టు కింద ఈ ఏడాది పూర్తిస్థాయిలో వరి పంట సాగు చేశారు. అలాగే బోరు బావులు, చెరువుల కింద వేసిన పంటలు కూడా ప్రస్తుతం కోతలు కోస్తున్నారు. దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ, మరికల్, అడ్డాకుల, మూసాపేట మండలాల నుంచి దేవరకద్ర మార్కెట్‌కు రైతులు ధాన్యాన్ని అమ్మకానికి తెచ్చారు. మార్కెట్‌కు దాదాపు 10 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. కాగా.. మధ్యాహ్నం జరిగిన టెండర్లలో సోనామసూరి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,109, కనిష్టంగా రూ.1,916 ధరలు లభించాయి. అలాగే ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,169, కనిష్టంగా రూ.1,900, హంస గరిష్టంగా రూ.1,759, కనిష్టంగా రూ.1,720 చొప్పున వచ్చాయి.


