ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని.. లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి హౌసింగ్ అధికారులు, ఎంపీడీఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి.. వాటిలో ఎన్ని బేస్‌మెంట్, రూఫ్, స్లాబ్ దశల్లో ఉన్నాయి.. ఇంతవరకు ఎన్ని పూర్తయ్యాయని హౌసింగ్ పీడీ శంకర్ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. లక్ష్య సాధనలో వెనకబడిన నర్వ, మరికల్, మక్తల్ మండలాల ఎంపీడీఓలను కలెక్టర్ వివరణ కోరారు. అయితే ఇసుక, మొర్రం కొరత, వర్షాల కారణంగా ఇళ్ల నిర్మాణాలకు ఆటంకం కలిగిందని వారు తెలియజేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. అత్యధికంగా వర్షాలు కురిసిన ఇతర జిల్లాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని, మన జిల్లాలో ఇలాంటి కారణాలతో నిర్మాణాలు నిలిచిపోయాయని చెప్పడం సరికాదన్నారు. వారం రోజుల్లో నిర్మాణాలను వేగిరం చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు అసలు నిర్మాణాలను మొదలుపెట్టని వారి ఇళ్లను 45 రోజుల కాలపరిమితి నిబంధన ప్రకారం రద్దు చేయాలని కలెక్టర్ చెప్పారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. కాగా, ఇందిరా డెయిరీ షిప్ ఫామింగ్ పథకానికి మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్, కోస్గి మండలాలతో పాటు మద్దూరు, కోస్గి మున్సిపాలిటీల నుంచి 631 దరఖాస్తులు అందాయని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎంఏ రషీద్ వివరించారు. వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాల ఎంపీడీఓలు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అదే విధంగా బాల్యవివాహాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ ఆరా తీశారు. సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప ఉన్నారు.
చదువుల పండుగతోవిద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం
చదువుల పండుగతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తి పెంపొందుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో చదువుల పండుగలో భాగంగా రూపొందించిన ‘కలలు కనేద్దాం.. నేర్చుకుందాం.. సాధిద్దాం’ అనే ప్రత్యేక విద్యా కార్యక్రమాల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థుల్లో సంభాషణ నైపుణ్యాలు పెంపొందించడానికి చదువుల పండుగ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఈఓ గోవిందరాజులు పాల్గొన్నారు.


