ఉపాధ్యాయ సమస్యల సాధనకు కార్యాచరణ
నారాయణపేట రూరల్: ఉపాధ్యాయ సమస్యల సాధనకు మరోసారి ఉద్యమ బాట పట్టనున్నట్లు తపస్ రాష్ట్ర అధ్యక్షుడు కానుగంటి హనుమంతరావు అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అందించాల్సిన పీఆర్సీ కాలపరిమితి ముగిసి 27 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. 317 జీఓ బాధితులందరికీ న్యాయం చేయాలని.. 190 జీఓ ద్వారా ఖాళీ అయిన చోట్ల వలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. జీఓ 25 ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు కోత విధించే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. విద్యార్థుల సంఖ్య ప్రకారం పోస్టుల సర్దుబాటు చేయాలి తప్ప.. తొలగిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 2010కి ముందు విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు అత్యధికంగా ఉన్నాయని.. ఈ జిల్లాకు ప్రత్యేకంగా బోధనా సహాయకులను వెంటనే నియమించి బోధనకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. సమావేశంలో నాయకులు గుంపు బాలరాజ్, శ్రీనివాస్‌గౌడ్, నరసింహ, సురేశ్, కథలప్ప, కుర్మయ్య, భాస్కర్‌రెడ్డి, చందు జామన్, అంబరీష్ పాల్గొన్నారు.


