బాల్యవివాహాలు చేస్తే చర్యలు తప్పవు
కోస్గి రూరల్: 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేపట్టే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఐసీడీఎస్ సీపీడీఓ వెంకటేశ్వరి అన్నారు. సోమవారం కోస్గి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో అంగన్‌వాడీ టీచర్లు, ఫంక్షన్‌హాల్స్ యజమానులు, పూజారులు, పాస్టర్స్, హజీలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చట్టప్రకారం బాలికలకు 18, బాలురకు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని.. ఆయా ధ్రువపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. చిన్నతనంలో వివాహాలు చేయడం వల్ల కలిగే అనర్థాలు, బాలల హక్కులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. బాల్యవివాహలు జరిగేందుకు ఆస్కా రం ఉన్న కుటుంబాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలన్నారు. అదే విధంగా బాలల సంరక్షణ కోసం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే పోలీసులు లేదా భరోసా హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బాలికలను రక్షిద్దాం.. బాలికలను చదివిద్దాం అనే బ్యానర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీఓ వేణుగోపాల్‌రెడ్డి, ఏఎస్‌ఐ ఆంజనేయులు పాల్గొన్నారు.


