నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా
నారాయణపేట: విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఆర్టిజన్ నుంచి సీఎండీ స్థాయి అధికారి వరకు కృషి చేస్తున్నట్లు ఎస్‌ఈ వెంకటరమణ అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయ ఆవరణలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్‌ఈ మాట్లాడుతూ.. ఐఎస్‌ఐ మార్కు కలిగిన సర్వీస్ వైర్లను మాత్రమే వ్యవసాయ మోటార్లకు వినియోగించాలని రైతులకు సూచించారు. తడి చేతులతో పంపుసెట్ల వద్ద విద్యుత్ తీగలను తాకరాదన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఏదేని సమస్య ఏర్పడితే విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏ రైతు కూడా తొందరపడి మరమ్మతు చేసేందుకు పూనుకోవద్దన్నారు. కార్యక్రమంలో డీఈ నర్సింహారావు, ఏఈలు ప్రదీప్ కుమార్, మహేశ్‌గౌడ్, అనిల్‌కుమార్, టి.వెంకట్రాంరెడ్డి, సతీశ్, అకౌంట్ జేఏఓ గోపినాయక్, ఈఆర్‌ఓ జేఏఓ రమేశ్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు.


