
‘రెవెన్యూ’ దరఖాస్తులపరిశీలన వేగవంతం
మాగనూర్: రెవెన్యూ దరఖాస్తుల పరిశీలన త్వరగతిన పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీను ఆదేశించారు.మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని తహసీల్దార్ సురేష్‌కుమార్‌కు సూచించారు. అనంతరం కార్యాలయ రికార్డులను, కంప్యూటర్, రికార్డుల గది, రిజిస్ట్రేషన్ల గదిని పరిశీలించారు. కార్యాలయ సిబ్బందికి పలు సలహాలు సూచనలు ఇచ్చారు.
నేడు వాలీబాల్
జట్టు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ స్టేడియంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఒరిజినల్ మెమో, బోనోఫైడ్‌తో ఉదయం 9 గంటలకు ఎంపికలకు హాజరుకావాలని ఆమె కోరారు.
19న ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: కల్వకుర్తి పట్టణంలో ఈనెల 19న ఉదయం 9 గంటలకు ఉమ్మడి జిల్లా ఖోఖో సీనియర్ పురుషుల, మహిళా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి జీఏ విలియం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లిలో వచ్చేనెల 6 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనేవారు ఒరిజినల్ ఆధార్‌కార్డుతో హాజరుకావాలని, మిగతా వివరాల కోసం సీనియర్ క్రీడాకారుడు రాజు (9985022847) నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
యోగాసన క్రీడాజట్ల ఎంపికలు
ఉమ్మడి జిల్లా యోగాసన సబ్ జూనియర్, జూనియర్ విభాగాల బాల, బాలికల జట్ల ఎంపికలను ఈనెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రాములు, ఆర్.బాల్‌రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 8–10, 10–12, 12–14, 14–16, 16–18 ఏళ్లలోపు క్రీడాకారుల ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, ఒరిజనల్ ఆధార్‌కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం 9440292044 నంబర్‌కు సంప్రదించాలని వారు సూచించారు.
ఖాళీ సీట్ల భర్తీకిదరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని బాలానగర్, దేవరకద్ర, రాంరెడ్డి గూడెం, జడ్చర్ల, నంచర్ల గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కోఆర్డినేటర్ వాణిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. టీజీసెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఈనెల 18 లోగా ఆయా గురుకులల్లో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
మొక్కజొన్న @ రూ.2,075
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం వివిధ ప్రాంతాల నుంచి 2,812 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.2,075, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆముదాలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5,709, కనిష్టంగా రూ.5,629గా ధరలు లభించాయి. హంస ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,789గా ఒకే ధర పలికింది.
రిటైర్మెంట్ బెనిఫిట్స్
వెంటనే విడుదల చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను తక్షణమే విడుదల చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండయ్యకు రావాల్సిన రిటైర్మెంట్ బకాయిల్లో రూ.9 లక్షలు వెంటనే తన అకౌంట్‌లో జమ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పదవీ విరమణ చేసిన అనేకమంది రిటైర్మెంట్ లాభాలు, గ్రాట్యుటీ, పింఛన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జీపీఎఫ్ బెన్‌ఫిట్లను అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.