మయూర వాహనంపై మురిసిన ఆదిదంపతులు | - | Sakshi
Sakshi News home page

మయూర వాహనంపై మురిసిన ఆదిదంపతులు

Oct 13 2026 1:35 AM | Updated on Oct 13 2026 1:35 AM

● శ్రీశైలంలో దేదిప్యమానంగా సాగుతున్న దేవీ శరన్నవరాత్రులు

● బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చిన భ్రమరాంబ

● స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పులకించిన భక్తజనం

స్వామిఅమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణ నిర్వహిస్తున్న

దృశ్యం

శ్రీశైలంటెంపుల్‌: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో దేవి శరన్నవరాత్రులు శాస్రోక్తంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు సోమవారం శ్రీశైల భ్రామరీ బ్రహ్మచారిణి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లు మయూర వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీగిరి క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కుమారీపూజ, సుహాసిని పూజ తదితర విశేష కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంబాదేవిని బ్రహ్మచారిణి స్వరూపంలో ప్రత్యేకంగా అలంకరించి ఆలయం ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులను చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజా హారతులు ఇచ్చారు. ప్రత్యేక అలంక్రీకృతులైన అమ్మవారి స్వరూపాన్ని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. రాత్రి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవారలు మయూర వాహనంపై విహరించి భక్తులకు ఆశీస్సులు అందించారు.

కనులపండువగా గ్రామోత్సవం

మయూర వాహనంపై ప్రత్యేకంగా అలంకరించిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకార మండపంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బ్రహ్మచారిణి స్వరూపంలోని అమ్మవారిని, మయూర వాహనంపై అధిష్టించిన స్వామిఅమ్మవార్లను ఆలయ రాజగోపురం మీదుగా వెలుపలకి తోడ్కొనివచ్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. గంగాధర మండపం నుంచి నందిమండపం, అక్కడి నుంచి బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామిఅమ్మవార్లను కనులారా భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని నీరాజనాలు సమర్పించారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీశైలంలో నేడు..

దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం శ్రీశైల క్షేత్రంలో చంద్రఘంట అలంకారంలో అమ్మవారు, రావణ వాహనసేవపై స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement