స్వాతి మహోత్సవం.. ప్రహ్లాదవరదుడి వైభవం | - | Sakshi
Sakshi News home page

స్వాతి మహోత్సవం.. ప్రహ్లాదవరదుడి వైభవం

Oct 13 2026 1:35 AM | Updated on Oct 13 2026 1:35 AM

ఆళ్లగడ్డ: అహోబిల నరసింహ స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం దిగువ అహోబిలంలో విశేష పూజలు నిర్వహించారు. వేకువ జామునే సుప్రభాత సేవతో స్వామి, అమ్మవార్లను మేలుకొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను యాగశాలలో కొలువుంచి అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరణ చేసి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆ తర్వాత శ్రీ స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.

పీజీఆర్‌ఎస్‌కు 120 ఫిర్యాదులు

బొమ్మలసత్రం: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 120 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్‌ షోరాణ్‌ మాట్లాడుతూ.. ప్రతి అర్జీదారుడితో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నామన్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యల పరిష్కారంలో జాప్యంపై ఆయా స్టేషన్‌ అధికారులను విచారించామన్నారు. బాధితులకు న్యాయం జరి గేలా చర్యలు తీసుకోకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ ఖాదర్‌బాషా పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీకి మాతృవియోగం

జిల్లా ఎస్పీ సునీల్‌ షొరాణ్‌ తల్లి సుమిత్ర (65) సోమవారం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందారు. స్థానిక ఎస్పీ బంగ్లాలో ఉంటున్న సుమిత్రి సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఉదయానంద ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా గుండె ఆగిపోవడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఎస్పీ సొంత రాష్ట్రమైన హర్యానాకు తరలించారు.

మళ్లీ సర్వర్‌ డౌన్‌

దొర్నిపాడు: ఏమైందో ఏమో తెలియదు గాని గత పది రోజుల నుంచి ఏపీ వెబ్‌ల్యాండ్‌ నుంచి ఆర్‌ఓఆర్‌, అడంగల్‌ డౌన్‌లోడ్‌ కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు రుణాలు రెన్యూవల్‌ చేసుకోవడానికి ఆర్‌ఓఆర్‌ లేక ఆందోళన చెందుతున్నారు. గత వారంలో వెబ్‌సైట్‌ పూర్తిగా పనిచేయలేదు. సోమవారం కొంత మంది రైతులు తహసీల్దార్‌ డిజిటల్‌ సైన్‌తో కూడిన ఆర్‌ఓఆర్‌, అడంగల్‌ కోసం సచివాలయాలు, మీసేవా కేంద్రాలకు వెళ్లినా ప్రయోజనం లేదు.ఽ రైతుకు సంబంధించిన ఎల్‌పీ నంబర్‌, ఖాతా నంబర్‌లను నమోదు చేస్తుంటే ఆన్‌లైన్‌లో డబ్బులు కట్‌ అవుతున్నా ప్రింట్‌ రావడం లేదని చెబుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి మెరిట్‌ లిస్ట్‌ విడుదల

కర్నూలు(హాస్పిటల్‌): కాంట్రాక్టు పద్ధతిన ఏడు కేటగిరీల్లోఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల రివైజ్డ్‌ ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌, సెలెక్షన్‌ జాబితా విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్‌, ఒక సెట్‌ నకలు సర్టిఫికెట్లతో ఈ నెల 15, 16వ తేదీల్లో ఉదయం 10.30 గంటలకు కర్నూలు మెడికల్‌ కాలేజీ కార్యాలయంలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థుల ఎంపిక రద్దు చేస్తామన్నారు. వివరాలు https://kurnool. ap.gov.in, https://nandyal.ap.gov.in, https://kurnool medicalcollege.ac.in వెబ్‌సైట్లలో ఉన్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement