● కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(న్యూటౌన్): ఐదు నుంచి ఏడేళ్ల వయస్సు, 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరిగా చేయించాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. జిల్లాలో సుమారు 52,133 మంది విద్యార్థులు బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉన్నందున, దసరా సెలవులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలను సమీప ఆధార్ కేంద్రాలు లేదా మొబైల్ కిట్లతో అనుసంధానం చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖల అభివృద్ధి పనులు, భూకేటాయింపులు, ఇంజనీరింగ్ ప్రాజెక్టులు, ఆధార్ నవీకరణపై పలు కీలక సూచనలు చేశారు. ఏ శాఖకై నా భూమి అవసరమైతే సంబంధిత హెచ్‌ఓడీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఈ–ఫైల్ రూపంలో కలెక్టర్‌కు రిక్విజిషన్ పంపించాలన్నారు. కలెక్టర్ ఆదేశాల అనంతరం మాత్రమే జాయింట్ కలెక్టర్, ఆర్‌డీఓ, తహసీల్దార్ల ద్వారా భూ కేటాయింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. ఆళ్లగడ్డలోని బాలసుదన్ సమీపంలో ప్రమాదకరంగా ఉన్న పాత బావికి రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణం వంటి పనులను చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, ఈడబ్ల్యూఐడీసీ, సమగ్ర శిక్ష, మున్సిపాలిటీ తదితర శాఖలు సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని సూచించారు. పెచ్చెరువు వద్ద టాయిలెట్, నీటి వసతులు పూర్తయినందున సోలార్ ప్యానెల్స్, విద్యుత్ సదుపాయాల ఏర్పాటుకు నెడ్క్యాప్ ద్వారా అంచనాలు సిద్ధం చేసి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు.


