జిల్లాలో ఇలా..
మార్కెట్లో ఏ వస్తువు అయినా అమాంతం పెరిగితే అదుపు చేయాల్సిన ధరల నియంత్రణ కమిటీ ఏసీ గదులకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నా యి. త్రిసభ్య కమిటీ అమరావతిలో కూర్చుని కోటలు దాటే ప్రకటనలు చేస్తుంటే వారి పరిధిలో పనిచేయాల్సిన జిల్లా, డివిజన్, మండల స్థాయి కమిటీలు సైతం కార్యాలయాలు దాటి మార్కెట్‌వైపు కన్నెత్తి చూడటం లేదు. నిబంధనల మేరకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులు ప్రతి వారం ఓ మార్కెట్‌ను తనిఖీ చేయాలి. కానీ బాబు డిజిటల్ పాలనలో జిల్లాలో ధరల నియంత్రణ కూడా కేవలం కాగితాలకే పరిమితమవడంతో దళారులు పండగ చేసుకుంటున్నారు.
ఆళ్లగడ్డ/కోవెలకుంట్ల: అఽధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు తగ్గిస్తాం.. సూపర్ సిక్స్‌తో స్వర్గం చూపిస్తాం.. అని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు రెండున్నరేళ్లుగా సామాన్య జనానికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. నిత్యావసర సరుకులు రాకెట్ కంటే వేగంగా ౖపైపెకి దూసుకు పోతున్నాయి. కూరగాయలు పొయ్యి మీద పెట్టకుండానే కుతుకుత ఉడుకుతున్నాయి. నూనెలు కడాయిలో పోయకుండానే సలసల కాగుతున్నాయి. ఉప్పు, పప్పు నుంచి బియ్యం, చిరుధాన్యాలు.. ఇలా అన్నింటి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటా యి. ప్రధానంగా బియ్యం, చెక్కర, బెల్లం, నూనె ధరలు ఈ రెండు, మూడు నెలల్లోనే 30 నుంచి 40 శాతం పెరగడంతో వినియోగదారులు భయపడుతున్నారు. ఎల్‌నినో ప్రభావం మరో రెండేళ్లు ఉంటుందని, అందరూ పొదుపు చర్యలు పాటించాలని ప్రభుత్వం, అధికారులు హడావుడి ప్రచారాల నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన పెద్ద వ్యాపారులు వినియోగదారుల అవసరాన్ని బట్టి ధరలను భారీగా పెంచుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే కొన్ని రకాల సరుకుల ధర దాదాపు 50 శాతం పైగానే రెట్టింపు అయ్యాయి.
బియ్యం భారం.. 16.50 కోట్లు
నిన్న మొన్నటి వరకు యుద్ధం పేరుతో ఇంధన ధరలు పెరిగాయని చెప్పిన వ్యాపారులు ఇప్పుడు ఎల్‌నినో బూచితో బియ్యం ధరలు అమాంతం పెంచేస్తున్నారు. నిల్వలు సమృద్ధిగా ఉన్నా.. కృత్రిమ కొరత సృష్టించి అడ్డగోలుగా ధరలు పెంచుతున్నారు. అధికారులు, పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా బియ్యం బడ్జెట్ పెరిగి పేద, మధ్య తరగతి కుటుంబాలపై పెనుభారం పడుతోంది. నంద్యాల జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో వరిసాగు అవుతోంది. సుమారు కోటి క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. అవసరానికి మించి ఉండటంతో ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిస్తున్నారు. గత మూడు, నాలుగేళ్లలో అంచానాకు మించి వరి పండించారు. అప్పటి నిల్వలు ఇంకా మిల్లర్ల దగ్గర ఉన్నాయి. ప్రస్తుతానికి బియ్యం కొరత అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. ప్రస్తుతం ఎల్‌నినో కారణంగా వచ్చిన కరువు దృష్ట్యా వరి దిగుబడి తగ్గుతుందన్న అంచనాతో బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రకాన్ని బట్టి 25 కేజీల బస్తాపై రూ. 300 నుంచి రూ. 350 ధర పెరిగింది. జిల్లాలో మొత్తం 6 లక్షల కుటుంబాలు ఉండగా ఇందులో 5.50 లక్షల కుటుంబాలు మార్కెట్‌లో బియ్యం కొంటున్నాయి. ఒక్కో కుటుంబం సగటున 25 కేజీల బస్తా వాడుతోంది. ఈ లెక్కన పెరిగిన రేటు ప్రకారం బస్తాకు రూ. 300 వేసుకున్నా నెలకు రూ. 16.50 కోట్ల మేర భారం పడుతోంది.
ఎలా కొనేది.. ఏం తినేది
● ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు లేక వరిసాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో రోజు రోజుకు ఽబియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. ప్రస్తు తం గ్రేడ్ వన్ బియ్యం కిలో రూ. 75 – 80 ఉండగా రానున్న రోజుల్లో రూ.వందకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదు.
● గతేడాది జిల్లాలో 27వేల హెక్టార్లలో కంది సాగు చేయగా పంటచేతికందే తరుణంలో మోంథా తుపా న్ ముంచెత్తడంతో రైతులు తీవ్రనష్టాలు చవిచూ శారు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఒక్క సారిగా కందిపప్పు ధర అమాంతం పెరిగిపోయింది. గతేడాది కిలో రూ. 117 ఉన్న మొదటిరకం కందిపప్పు ఈ నెలలో ఏకంగా రూ. 133కు చేరింది.
● గతేడాది ఇదే సమయానికి కిలో ఎండుమిర్చి రూ. 176. 55 ఉన్న మొదటిరకం ప్రస్తుతం రూ. 300 దాక ధర పలుకుతోంది. రెండోరకం ఎండుమిరపకాయలు రూ. 253కు చేరింది. ఏడాది కాలంలోనే కిలో ఎండు మిరపకాయలపై ఏకంగా రూ. 124 ధర పెరగడం విచారకరం.
● గతేడాది కిలో నాణ్యమైన వెల్లుల్లి రూ. 190 కాగా ప్రస్తుతం కిలో రూ. 280కి చేరింది.
● గతంలో లీటరు పామాయిల్ రూ. 110 ఉండగా ప్రస్తుతం రూ. 150, నుంచి రూ. 160 వరకు పలుకుతోంది. కంది, మినప, పెసర పుప్ప, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, గోదుమ పిండి ఇలా నెల వారి వినియోగించే 10 నుంచి 20 రకాల వస్తువులపై కిలోకు రూ. 30 నుంచి రూ. 40 ధర పెరిగింది.
● నాలుగు నెలల క్రితం కిలో రూ.40 – రూ. 45 ఉన్న చెక్కర, బెల్లం ఇప్పుడు నోట్లో వేసుకుందామంటే చేదుగా రుచిస్తున్నాయి. ప్రస్తుతం చెక్కర కిలో రూ. 74 వరకు విక్రయిస్తుండగా బెల్లం కిలో రూ. 80కి చేరింది.
మండుతున్న నిత్యావసర
సరుకుల ధరలు
బియ్యం ధర రోజురోజుకు పైకి..
ఆకాశానంటుతున్న నూనె, కందిపప్పు,
చక్కెర, ఉల్లి ధరలు
ధరల పెంపుతో సగటు జీవి సతమతం
దళారుల చేతుల్లో పేదవర్గాలు దోపిడీ
మార్కెట్ ధరల నియంత్రణలో
చంద్రబాబు సర్కార్ వైపల్యం
గ్రామ పంచాయతీలు 489 జనాభా 17,82,241
కుటుంబాలు 5,73,419


