● కోలుకోలేక వృద్ధుడి మృతి
గోస్పాడు: వృద్ధాప్యంలో అన్యోన్యంగా జీవిస్తున్న ఆ దంపతుల్లో ఒకరిని అనారోగ్యం వేధించింది. ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా తగ్గకపోవడంతో ఇక ఎవరికీ భారం కాకూడదని వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న అతని భార్య కూడా తను లేని జీవితం నాకెందుకంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన యాళ్లూరు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యాళ్లూరుకు చెందిన పుట్ట రామకృష్ణుడు(70) ఆస్తమా వ్యాధితో నిత్యం బాధపడుతుండే వాడని తెలిపారు. అయితే పలు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న జబ్బు నయం కాక, వ్యాధి తీవ్రతను తట్టుకోలేక విసుగు చెంది ఆదివారం రసాయన పౌడర్‌ను నీటిలో కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన భార్య లింగమ్మ కూడా అదే పౌడర్‌ను నీటిలో కలుపుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన బంధువులు ఇద్దరిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రామకృష్ణుడి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. భార్య లింగమ్మ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతుని కుమారుడు దివాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.


