అర్జీల పరిష్కారంపై ప్రజల అభిప్రాయమే ప్రామాణికం | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంపై ప్రజల అభిప్రాయమే ప్రామాణికం

Oct 5 2026 3:56 AM | Updated on Oct 5 2026 3:56 AM

● జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల(న్యూటౌన్‌): ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తూ, అధికారులు అందించిన పరిష్కారాలపై అర్జీదారుల వాస్తవ అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత ఫీడ్‌బ్యాక్‌ విధానాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి పిలుపునిచ్చారు. ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ద్వారా సమర్పించిన అర్జీలపై అధికారులు తీసుకున్న చర్యల పట్ల అర్జీదారులు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారో నేరుగా తెలుసుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందన్నారు. అర్జీ పరిష్కారమైనట్లు సమాచారం అందిన అనంతరం, సంబంధిత రసీదు లేదా సందేశంలో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్‌ చేసి, పరిష్కారంపై తమ సంతృప్తి లేదా అసంతృప్తిని అర్జీదారులు నమోదు చేయాలన్నారు. ప్రజల నుంచి అందే అభిప్రాయాల ఆధారంగా పరిష్కారాల నాణ్యతను అంచనా వేసేందుకు, అధికారుల పనితీరును మెరుగుపరిచేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం వంటి అంశాలను గుర్తించడంతో పాటు, ప్రభుత్వ సేవల నాణ్యతను నిరంతరం మెరుగుపరిచేందుకు ప్రజల ఫీడ్‌బ్యాక్‌ కీలకంగా నిలుస్తుందన్నారు.

పోతిరెడ్డిపాడు నుంచి తగ్గిన నీటి విడుదల

జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి నీటి విడుదల రోజురోజుకు తగ్గిపోతుంది. ఆదివారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో శ్రీశైలం డ్యాంలో 849.90 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు వద్ద 848.90 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ 2, 4, 5, 7 గేట్లు తెరచి ఉంచినప్పటికీ కేవలం 1,500 క్యూసెక్కుల నీరు మాత్రమే ఎస్సారెమ్సీ కాల్వలోకి వెళ్తున్నాయి. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి జీఎన్‌ఎస్‌ఎస్‌ కాల్వకు సరఫరా చేస్తున్నట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు. గత నెల 21వ తేదీన శ్రీశైలం డ్యాంలో 858 అడుగుల నీటిమట్టం ఉండగా ప్రస్తుతం 849.90 అడుగుల నీటిమట్టానికి చేరుకొంది. ఇప్పటిదాకా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 34 టీఎంసీల నీటిని మాత్రమే ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీఎస్కేప్‌ కాల్వలకు విడుదల చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ

నంద్యాల(న్యూటౌన్‌): స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఈనెల 5వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖా స్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులు స్వీకరించారు.

శ్రీమఠానికి పోటెత్తిన భక్తులు

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రానికి భక్తులు పోటెత్తారు. శుక్ర, ఆదివారాలు సెలవులు కావడంతో కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. భక్తుల రాకతో శ్రీమఠం మధ్వ కారిడార్‌ సందడిగా కనిపించింది. శ్రీ రాఘవేంద్రుడి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. మంచాలమ్మ, రాఘవేంద్రుల దర్శన క్యూలైన్లు కిక్కిరిశాయి. భక్తులు మంచాలమ్మ, రాఘవేంద్రుల బృందావనం దర్శనం చేసుకుని ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల వెండి, స్వర్ణ, నవరత్న రథోత్సవాల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement