కోవెలకుంట్ల మండలం
● అదనుకు ఆశలు రేకెత్తించిన వర్షాలు
● వారం రోజుల నుంచి తీవ్రమైన ఎండలు
● భూమిలో ఆవిరవుతున్న తేమ
● ప్రశ్నార్థకంగా మారిన సాగు
కోవెలకుంట్ల: వర్షాలు కురిసే అవకాశం లేకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో జిల్లాలో జొన్న సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఏటా వర్షాధారంగా జొన్న పంట సాగు చేసినా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఒకటి, రెండు తుపాన్లతో వర్షాలు కురిసి పంట చేతికందేది. ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ నెలాఖరు వరకు జొన్న సాగుకు అదను కావడంతో రైతులు సాగు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడ్డారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది 31,297 హెక్టార్లలో మహేంద్ర, హైటెక్, పచ్చజొన్న రకాల జొన్న సాగు లక్ష్యం కాగా సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు జొన్న విత్తనం వేయవచ్చు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వారం రోజుల క్రితం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. పొలాల్లో తడి ఆరిన వెంటనే విత్తనం వేసుకోవచ్చని రసాయన ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకున్నారు. అయితే ఇటీవల జిల్లాలో ఎండలు తీవ్రతరమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్ నెలలో ఏకంగా 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఎండలు మరింత పెరిగే ఆస్కారం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఎండలకు భూమిలోని తేమశాతం ఆవిరవుతుండటం, రసాయన ఎరువులు విత్తే సమయంలో భూమిలో అరకొరగా ఉన్న తేమ శాతం పడిపోతుతుండటంతో విత్తనసాగుపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పోవడంతో ఎస్సార్బీసీ, కేసీకెనాల్, చెరువులు, కుంటలు, వాగులు, తదితర సాగునీటి ప్రాజెక్టులు నీరు లేక వెలవెలబోతున్నాయి. జొన్న పంటలో దిగుబడులు చేతికందాలంటే పైరు వివిధ దశల్లో కనీసం మూడు నుంచి నాలుగు నీటి తడులు అందించాల్సి ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది ఎటువంటి పరిస్థితుల్లో జొన్న సాగు చేయవద్దని వ్యవసాయ అధికారులు రైతులను హెచ్చరిస్తు న్నారు. రబీ సీజన్ ప్రారంభమైన నేసథ్యంలో ఈ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తే తప్ప జొన్న సాగు చేసే పరిస్థితులు లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు రైతులు వరణుడిపై భారం వేసి జొన్న విత్తన పనులు చేపడుతున్నారు.
రెండు ఎకరాల్లో విత్తనం వేశాను
గత నెలలో భారీ వర్షాలు కురియడంతో ఎకరా రూ. 16 వేలు కౌలు చెల్లించి రెండు ఎకరాల్లో ఇటీవల పచ్చజొన్న రకానికి చెందిన జొన్న పంట సాగు చేశాను. వారం రోజుల నుంచి ఎండలు అధికమై భూమిలో తేమ శాతం ఆవిరవుతోంది. ఎండలు ఇలాగే కొనసాగితే మొలక వచ్చే పరిస్థితి ఉండదు. పొలాన్ని కౌలుకు తీసుకుని వరణుడిపై భారం వేసి విత్తనం వేశాను. – రాజేశ్వరరెడ్డి, రైతు, జోళదరాశి,
జొన్న సాగు చేయొద్దు
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జొన్న సాగు చేయవద్దు. జొన్న పండించడానికి కనీ సం మూడు నుంచి నాలుగు నీటి తడులు అవసరం. వర్షాధారం కింద ప్రస్తుత పరిస్థితుల్లో జొన్న సాగు చేయడం సాధ్యం కాదు. ఇటీవల వర్షాలు కురిసినా ఎండలు ఎక్కువగా ఉండటంతో భూమిలో తేమ శాతం ఆవిరవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జొన్న సాగు చేస్తే పంట త్వరగా బెట్టకు చేరుకుని మొక్కలు ఎండిపోయి నష్టపోతారు.
– సుధాకర్‌రెడ్డి, ఏఓ, కోవెలకుంట్ల


