దిగుబడులు తాకట్టు పెట్టి రూ.4.80 కోట్ల రుణం | - | Sakshi
Sakshi News home page

దిగుబడులు తాకట్టు పెట్టి రూ.4.80 కోట్ల రుణం

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

ఓర్వకల్లు: రైతులు భద్రపరిచిన పంట ఉత్పత్తులను కోల్డ్‌ స్టోరేజ్‌ యజమాని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.4.80 కోట్ల రుణం తీసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నన్నూరు సమీపంలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు ఎదురుగా వున్న శివశక్తి కోల్డు స్టోరేజీలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన వందలాది మంది రైతులు ఎండు మిరప, జొన్నలు, కందులు, శనగలు, మొక్కజొన్న, మినుములు, పెసర తదితర రకాల ఉత్పత్తులను నిల్వ చేసుకున్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎవ్వరూ కూడా పంట ఉత్పత్తులను అమ్ముకోలేక పోయారు. పంట ఉత్పత్తులను నిల్వచేసుకొనే సమయంలో రైతులతో కోల్డు స్టోరేజ్‌ యజమాన్యం అగ్రిమెంట్లు చేసుకొని వారి భూ పత్రాలను తీసుకున్నట్లు సమాచారం. ఆ రికార్డులతో రెండు నెలల క్రితం సుమారు 50 వేల బస్తాలను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారులకు చూపించి దాదాపు రూ.4.80 కోట్ల రుణం పొందినట్లు తెలిసింది. ఈ రుణానికి సంబంధించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొలేటరల్‌ మేనేజ్‌మెంటును ఇండియన్‌ కమోడిటీస్‌కు అప్పగించినట్లు బ్యాంకు అధికారులు తెలిపినట్లు రైతులు పేర్కొన్నారు. స్టోరేజ్‌ పరిశీలనకు వెళ్లిన బ్యాంక్‌ అధికారులను యజమాని మభ్యపెట్టి లోపలికి వెళ్లనీయలేదు. కోల్డుస్టోరేజ్‌లో చెదలు, పురుగులు పట్టకుండా మందు పిచికారీ చేశామని, 20 రోజుల వరకు స్టోరేజ్‌ను తెరవకూడదని చెప్పారు. ఆ తర్వాత కూడా కొన్నాళ్లు కాలయాపన చేసుకుంటూ వచ్చారు. ఇటీవల స్టోరేజ్‌ని తెరిచి బ్యాంకు అధికారులు తనిఖీ చేయగా.. సుమారు 18 వేల బస్తాల ధాన్యం తగ్గిపోయినట్లు గుర్తించిన అధికారులు యజమానిని ప్రశ్నించారు. అయితే రెండు, మూడు రోజుల్లో అందుకు సంబంధించిన మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పిన యజమాని డబ్బులు చెల్లించకపోగా, ఫోన్‌కు స్పందించక పోవడంతో, అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు ఓర్వకల్లు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న రైతులు కర్నూలు జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో పాటు, స్థానిక ఎమ్మెల్యే గౌరు చరిత దృష్టికి తీసుకెళ్లినట్లు తీసుకెళ్లారు. విషయంపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని రైతులు మొర పెట్టుకున్నారు.

రైతులకు తెలియకుండా కోల్డ్‌ స్టోరేజ్‌ యజమాని నిర్వాకం

బ్యాంక్‌ అధికారుల ఫిర్యాదుతో వెలుగులోకి..

న్యాయం చేయాలని రైతుల మొర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement