జిల్లాలో సమృద్ధిగా నీటి వనరులు. శ్రీశైలం ప్రాజెక్టు నిండితే ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్‌, కుందూ కళకళనే. వీటి కింద ఆయకట్టు నిత్యం పచ్చతోరణమే అన్నట్లుగా వరి సాగు ఉండేది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో ప్రస్తు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో సమృద్ధిగా నీటి వనరులు. శ్రీశైలం ప్రాజెక్టు నిండితే ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్‌, కుందూ కళకళనే. వీటి కింద ఆయకట్టు నిత్యం పచ్చతోరణమే అన్నట్లుగా వరి సాగు ఉండేది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో ప్రస్తు

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

వరి సాగు చేయలేకపోయాను నారుమడి కూడా పోయలేకపోయా

జిల్లాలో వరిసాగు వివరాలు (హెక్టార్లలో)

ఎకరా రూ. 12 వేలు కౌలు చెల్లించి ఒకటిన్నర ఎకరాలో ఈ ఏడాది కుందూనదికి అనుసంధానంగా ప్రవహిస్తున్న కై పవాగు పరిధిలో వరి సాగు చేయాలన్నాను. వరినారుకు అడ్వాన్సు చెల్లించాను. వర్షాలు లేకపోవడంతో వాగులో నీరు అడుగంటింది. వర్షం కోసం నెల రోజులపాటు ఎదురుచూసినా వర్షం పడకపోవడంతో వాగుకు నీరు రాకపోవడంతో సాగుకు అదును దాటిపోవడంతో సాగు చేయలేకపోయాను. ఆ స్థానంలో రబీ సీజన్‌లో నాకున్న ఐదు ఎకరాల పొలంతోపాటు కౌలు పొలంలో ప్రత్యామ్నాయ పంటలైన జొన్న, పప్పుశనగ పంటల సాగుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నాను.

– రమణారెడ్డి, రైతు, చిన్నకొప్పెర్ల,

కోవెలకుంట్ల మండలం

ఈ ఏడాది నాలుగు నెలల పాటు చుక్క వర్షం కురియకపోవడంతో పంటలు సాగు చేయలేకపోయాను. ఈ ఏడాది గ్రామ సమీపంలోని కుందరవాగు పరివాహకంలో 12 ఎకరాల సొంత పొలంలో వరి సాగు చేయాలనుకున్నాను. వాగులో చుక్క నీరు లేకపోవడంతో కనీసం నారుమడి కూడా పోయలేకపోయాను. వరిసాగుకు అదును దాటి పోవడంతో ఆ స్థానంలో జొన్న పంటసాగుకు సమాయత్తమవుతున్నాను. – వెంకటేశ్వరరెడ్డి, రైతు,

కంపమల్ల, కోవెలకుంట్ల మండలం

కోవెలకుంట్ల: వరి సాగు విస్తారంగా సాగు చేసే జిల్లాలో నంద్యాల ఒకటి. గత ఏడాది విస్తారంగా వర్షాలు కురిసి సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా చేరడంతో జిల్లాలో లక్ష్యాన్ని మించి 78 వేలహెక్టార్లలో వరిని సాగు చేశారు. అయితే పైరు చేతికందే తరుణంగా భారీ వర్షాలు కురిసి తీవ్ర నష్టాలు చవి చూశారు. వేలాది రూపాయాలు పెట్టుబడుల రూపంలో వెచ్చించి నష్టాల ఊబిలో కూరకపోయారు. ఆ నష్టాన్ని ఈ ఏడాది పూడ్చుకుందామనుకున్న జిల్లా రైతాంగానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. జూన్‌ మొదటి వారంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి దాదాపు నాలుగు నెలల పాటు చుక్క వర్షం కురియకపోవడంతో ఖరీఫ్‌ తుడుచకపెట్టుకపోయింది. జిల్లాలో జూలై రెండవ వారం నుంచి వరి సాగుకు అదును కాగా అప్పటికై నా వర్షాలు కురిసి సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు సంవృద్ధిగా చేరుతుందని భావించారు. గత నెలాఖరు నాటికి వరి సాగుకు అదును దాటిపోయింది. అదును ముగిసే నాటికై నా వర్షాలు కురుస్తాయనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో బోర్లు, బావులు, కుందూనది, పాలేరు, కుందర వాగు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌, తదితర నీటి ఆధారంగా 72,201 హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా కేవలం 37,395 హెక్టార్లకే సాగు పరిమితమైంది. బోర్లు, బావులు, చెరువుల ఆధారంగానే ఆయా ప్రాంతాల్లో వరి సాగైంది. ఇందులో బండి ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 5,983 హెక్టార్లలో, పాణ్యం మండలంలో 3,450 గోస్పాడు మండలంలో 3,029, మహానంది మండలంలో 2,601, నంద్యాల మండలంలో 2,411 హెక్టార్లలో ఆళ్లగడ్డ మండలంలో 2,312 హెక్లార్లలో సాగైంది. మిగిలిన ఎక్కువ శాతంమండలాల్లో వెయ్యి హెక్టార్లలోపు మాత్రమే సాగు పరమితమైంది.

ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌ పరిధిలో

సాగు నిల్‌..

ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రారంభం నుంచి జిల్లా రైతాంగాన్ని సాగునీటి గండం వెంటాడుతోంది. శ్రీశైలం జలాశయంలో నీరు సమృద్ధిగా ఉన్నా నీటిని విడుదల చేయకపోవడంతో ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌లు నీరు లేక వెలవెలబోతున్నాయి. వీటి ఆధారంగా రైతులు వరి సాగు చేయవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో రైతులు వరి సాగు చేసేందుకు సాహసం చేయలేకపోయారు. నీరు వస్తుందో లేదోనన్న సందిగ్ధంతో కనీసం పూర్తి స్థాయిలో నారుమడులు కూడా పోసుకోలేకపోయారు. సెప్టెంబర్‌ నెల ముగుస్తున్నా కాల్వల్లో చుక్క నీరు లేక ఒట్టిపోయాయి. కాల్వల పరిధిలో వేలాది ఎకరాల ఆయకట్టు పొలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో వివిధ పంటల సాగుకు అదును దాటిపోగా వచ్చే నెల నుంచి రబీసీజన్‌ ప్రారంభం కానుంది. కాల్వల పరిధిలో మొక్కజొన్న, మినుము, జొన్న, పప్పుశనగ, తదితర పంటలు సాగు చేయాలని వేలాది రూపాయలు ముందస్తు కౌలు చెల్లించి రైతులు పొలాను కౌలుకు తీసుకున్నారు. ఆ సీజన్‌లో కనీసం ఆరుతడి పంటల సాగుకై నా కాల్వలకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

నియోజకవర్గం సాగు లక్ష్యం సాగైనది

శ్రీశైలం 20,417 10,387

ఆళ్లగడ్డ 19,776 10,176

నంద్యాల 9,219 6,549

బనగానపల్లె 11,371 4,129

నందికొట్కూరు 3,203 1,211

డోన్‌ 466 102

పాణ్యం, 5,749 4,841

గడివేముల

వర్షాభావ పరిస్థితులతో

సగానికి పడిపోయిన వరి సాగు

సెప్టెంబర్‌ ముగుస్తున్నా కాల్వలకు

నీళ్లు రాని వైనం

ఎస్సార్బీసీ, కేసీకెనాల్‌ ఆయకట్టు

బీళ్లుగా దర్శనం

జిల్లాలో 37 వేల హెక్టార్లలో

మాత్రమే సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement