ఎన్నికలు జరిపేవరకు పిల్లలను బడికి పంపమంటూ తల్లిదండ్రుల నిరసన
హెచ్‌ఎం, ఎంఈఓలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కొత్తపల్లి: కొక్కెరంచ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం పుష్పలత, కొత్తపల్లి మండల విద్యాధికారి కె.నాగరాజు కుట్రపూరితంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా వేయించారని, వారిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఆ పాఠశాల వద్ద నిరసన తెలిపారు. బడికి వచ్చిన విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో మంగళవారం ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. కొక్కెరంచ ప్రాథమికోన్నత పాఠశాలలో 86 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. ఓ వైపు 67 మంది ఉండగా మరోవైపు 19 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురు ఓటింగ్ ప్రక్రియకు రాలేదు. ఓ వర్గం వారు తక్కువగా ఉండడంతో టీడీపీ నేతల ఒత్తిడితో హెచ్‌ఎం పుష్పలత, ఎంఈవో నాగరాజు ఎన్నికలు జరగకుండా కుట్రలు పన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. గొడవలు జరుగుతాయని ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉందంటూ ఎన్నికలు వాయిదా వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ నేతలు పాఠశాలలోకి రాజకీయాలు తెచ్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేక హెచ్‌ఎం పుష్పలత ఉద్దేశపూర్వకంగా విధులకు సెలవు పెట్టారని ఆరోపించారు. హెచ్‌ఎం, ఎంఈఓలపై చర్యలు తీసుకొని ఎస్‌ఎంసీ ఎన్నికలను పకడ్బందీగా జరపకపోతే తమ పిల్లలను బడికి పంపేది లేదంటూ వారు స్పష్టం చేశారు.


