కర్నూలు(అర్బన్): పద్మ అవార్డులకు అర్హులైన వ్యక్తుల నుంచి నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక తెలిపారు. వివిధ రంగాల్లో అసాధారణ సేవలు అందించిన వ్యక్తులు పద్మ అవార్డులకు అర్హులన్నారు. అర్హులు ఈ నెల 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నామినేషన్లను పంపుకోవాలన్నారు. భారత ప్రభుత్వం ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను(పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) ప్రదానం చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సేవల్లో ఉన్న ఉద్యోగులు(వైద్యులు, శాస్త్రవేత్తలు మినహా) ఈ అవార్డులకు అర్హులు కారన్నారు. నామినేషన్లు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా http://awardr.gov.in వెబ్‌సైట్‌లో మాత్రమే సమర్పించాలన్నారు.
పులుల సంరక్షణపై అవగాహన
ఆత్మకూరురూరల్: ఈ నెల 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జున సాగర్ –శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ శాఖ పులుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. శ్రీశైలం రేంజ్ పరిధిలోని పెచ్చెర్వులో వివిధ చెంచుగూడేల నడుమ నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను సబ్ డీఎఫ్‌ఓ బబిత కుమారి సోమవారం ప్రారంభించారు. చెంచుల్లో పులి సంరక్షణ అవగాహన కల్పించడంతో పాటు వారిలో ఆత్మనిర్భరతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఆమె తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని థెరిసా కళాశాలలో సంఘమిత్ర అనిమల్ ఫౌండేషన్ వైల్డ్ లైఫ్ హెడ్ మహమ్మద్ ఇంద్రిస్ విద్యార్థులకు పులి సంరక్షణ, జీవవైవిధ్య ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో శ్రీశైలం ఎఫ్‌ఆర్‌ఓ పరమేశ్, ఎఫ్‌ఎస్‌వో జ్యోతి స్వరూప్, కే జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
పాస్‌పోర్ట్ సేవల్లో అసౌకర్యాలు కలగరాదు
కర్నూలు(అర్బన్): పాస్‌పోర్ట్ సేవల కోసం వచ్చే వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ నందన్‌లాల్ భూక్య అన్నారు. సోమవారం ఇక్కడకు వచ్చిన ఆయనకు స్థానిక ప్రధాన తపాల కార్యాలయంలో కర్నూలు డివిజన్ సూపరిటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ జి. జనార్దన్‌రెడ్డి పూలబొకే అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ స్థానిక ప్రధాన తపాల కార్యాలయంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ( పీఓపీఎస్‌కే ) పరిశీలించి మాట్లాడారు. పాస్‌పోర్ట్ సేవలను మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇకపై శనివారాల్లో కూడా పీఓపీఎస్‌కే అపాయింట్‌మెంట్ స్లాట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నిరాశాజనకంగా
వేరుశనగ ధరలు
కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ ధరలు నిరాశజనకంగా ఉండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా.. కర్నూలు. ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లోనే వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ముందస్తు ఖరీఫ్‌లో నీటి వసతి కింద సాగు చేసిన వేరుశనగ దిగుబడులు ప్రస్తుతం మార్కెట్‌లకు వస్తున్నాయి. కర్నూలు మార్కెట్‌కు 1096 క్వింటాళ్ల వేరుశనగ రాగా... కనిష్ట ధర రూ.2277, గరిష్ట ధర రూ.8721 లభించింది. ఆదోని మార్కెట్‌కు రికార్డు స్థాయిలో 5,625 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కనిష్ట ధర రూ.3,599, గరిష్ట ధర రూ.8,998 పలికింది. ఎమ్మిగనూరు మార్కెట్‌కు 696 క్వింటాళ్ల వేరుశనగ రాగా కనిష్ట ధర రూ.2,611, గరిష్ట ధర రూ.7,909 లభించింది. అలాగే ప్రస్తుతం రైతుల దగ్గర పత్తి నిల్వలు లేవు. వ్యాపారులు నిల్వ చేసిన పత్తికి నేడు అధిక ధరలు లభిస్తుండటం విశేషం. ఆదోని మార్కెట్ యార్డులో పత్తికి కనిష్టంగా రూ.9,179, గరిష్టంగా ధర రూ.9,677 ధర లభించగా.. సగటు ధర రూ.9,339 నమోదైంది.


