భూములు లాక్కోని రైతులకు అన్యాయం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

భూములు లాక్కోని రైతులకు అన్యాయం చేయొద్దు

Jul 28 2026 1:18 AM | Updated on Jul 28 2026 1:18 AM

మీదివేములలో బలవంతంగా

భూసేరణ వద్దు

పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు

చేసిన కాటసాని రాంభూపాల్‌రెడ్డి

కర్నూలు(సెంట్రల్‌): ఓర్వకల్లు మండలం మీదివేములలో బలవంతంగా ఏపీఐఐసీ కోసం భూసేకరణ చేసి రైతులకు అన్యాయం చేయొద్దని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన మీదివేముల గ్రామ రైతులతో కలసి బలవంతపు భూసేకరణ చేయొద్దని కోరుతూ కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీదివేములలో ఏపీఐఐసీ 200 ఎకరాలను సేకరించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ జీవనాధారంగా ఉన్న భూములను తక్కువ పరిహారంతో తీసుకొని రైతుల జీవితాలను అంధకారంలోకి నెట్టవద్దన్నారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా భూసేకరణ చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ భూసేకరణ అమలైతే గ్రామస్తులు తమ ఇళ్లను కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రైతుల జీవనోపాధికి భంగం కలిగించే ఈ భూసేకరణను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కోరారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు అటువైపు కూడా చూడడం లేదన్నారు. ఇంత దారుణమైన స్థితిలో చంద్రబాబు పాలన ఉందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిస్తే ప్రజలకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాటసాని వెంట మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ ప్రభాకరరెడ్డి, మీదివేముల గ్రామ రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement