● నేడు ధర్మకర్తల మండలి సమావేశం
● సాలు మండపాలు, తెలంగాణ
అర్చకుల వివాదం, దుకాణాల
టెండర్‌పై సర్వత్రా ఉత్కంఠ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో మంగళవారం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు అధ్యక్షతన జరుగనున్న తొమ్మిదవ ట్రస్ట్‌బోర్డు సమావేశం సర్వత్రా టెన్షన్‌గా మారింది. సాలు మండపాల టెండర్‌ను రద్దు చేయాలని, దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన 10 మంది అర్చకులను ఆ రాష్ట్రానికి పంపాలని ఇప్పటికే సీఎం చంద్రబాబుకు శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు లేఖ రాశారు. అంతేకాకుండా గత నెలలో దేవస్థాన వాణిజ్య సముదాయంలోని పలు దుకాణాలకు నిర్వహించిన బహిరంగ వేలాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెళ్తువెత్తాయి. ఈ క్రమంలో తొమ్మిదవ ధర్మకర్తల మండలి సమావేశంలో సాలు మండపాల టెండర్, తెలంగాణ అర్చకుల అంశం, దుకాణాల బహిరంగ వేలం నిర్ణయాలను అజెండా అంశాలుగా చేర్చారు. ఈ సమావేశంలో ముఖ్యమైన ఈ మూడు అజెండాలపై చర్చ హీట్ హీట్‌గా సాగే అవకాశం ఉంది. సాలు మండపాల వివాదంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ధర్మకర్తల మండలి నిర్ణయమే కీలకం కావడంతో టెండర్ల భవితవ్యం కూడా తేలనుంది.
సాలు మండపాల అజెండాపై
సర్వత్రా ఆసక్తి..
సాలు మండపాల వ్యవహారం ధర్మకర్తల మండలిలోనూ విభేదాలను తీసుకువచ్చింది. ఇప్పటికే సాలు మండపాల టెండర్ బిడ్‌ను దేవస్థాన అధికారులు ఓపెన్ కూడా చేశారు. టెండర్ దక్కించుకునేందుకు మూడు కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ టెండర్‌ను ఆమోదింపజేసేందుకు దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్, శ్రీశైలం ఈఓ ఎం.శ్రీనివాసరావు ఇప్పటికే ఓ సీనియర్ సభ్యుడితో టచ్‌లోకి వెళ్లి మిగిలిన ధర్మకర్తల మండలి సభ్యులతో చర్చించి సాలు మండపాల టెండర్ అజెండాకు ఆమోదం తెలిపేలా చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. అయితే ధర్మకర్తల మండలిలో చైర్మన్‌తో 16 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది మహిళా సభ్యురాలు ఉన్నారు. వీరికి ఆయా అజెండా అంశాలపై అంతంత మాత్రంగానే అవగాహన ఉంది. మిగిలిన సభ్యుల్లో ఒకరిద్దరు తప్పా అందరూ అజెండాలపై అవగాహన కలిగి చర్చించే వారే. సాలు మండపాలపై ట్రస్ట్‌బోర్డు తీర్పు ఎలా ఉండబోతుందోనని ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో చైర్మన్ వాదనకు బోర్డు మద్దతు లభిస్తుందా? కోరం చైర్మన్ వైపు ఉంటుందో లేక మిగిలిన సభ్యుల వైపు ఉంటుందో వేచిచూడాలి. ఈ నేపథ్యంలో మంగళవారం జరుగబోయే ట్రస్ట్‌బోర్డు సమావేశంపై సర్వత్రా టెన్షన్ టెన్షన్ నెలకొంది.


