● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ఖరీఫ్‌పై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, ఈ మేరకు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వివిధ అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఒకవేళ వర్షాలు కురిసినా.. ఆ తర్వాత 15 నుంచి 20 రోజుల పాటు పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే పరిస్థితులు ఉండే అవకాశముందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో భూగ ర్భ జలాలు మరింత తగ్గిపోవడంతో తాగునీటి సరఫరాతో పాటు పశువులకు సైతం నీరు, పచ్చి మేత కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే శ్రీశైలం జలాశయంలో నీటి లభ్యత ఆందోళనకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో నీటి వినియోగంలో ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలు పాటించాలన్నారు. పలు రిజర్వాయర్లలో కూడా నీటి నిల్వలు తగ్గుతున్నాయ న్నారు. వరి, మొక్కజొన్నకు బదులుగా తక్కువ తేమతో సాగు చేసే కంది, మినుము, పెసర, సజ్జ, కొరల్రు, ఆముదం, జొన్న వంటి పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. పంటల బీమా నమోదు గడువు జూలై 31 వరకు ఉన్నందున అర్హులైన ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక ప్రచారం నిర్వహించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్‌ఓ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.


