నంద్యాల(అర్బన్): డీఎస్సీ 2025 నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్‌యాదవ్ విమర్శించారు. డీఎస్సీ మొదటి మెరిట్ లిస్టు రద్దు చేయడానికి కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మెగా కాదు.. దగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కాలేజీ నుంచి బొమ్మలసత్రం ఫ్లై ఓవర్ కింద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సూచనల మేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సురేష్‌యాదవ్ మాట్లాడుతూ.. డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం బాధాకరమన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామన్నారు. పార్టీ పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ కాదు.. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు దగా డీఎస్సీని అందించిందన్నారు. యువత విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. రాష్ట్రంలో జాబ్ ఫర్ సేల్ నడుస్తోందన్నారు. ప్రశ్నపత్రాలు తయారు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శులు మణిరెడ్డి, మాధురిగౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సుమంత్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, సన్నాల సాయిరాంరెడ్డి, శ్రీశైలం విద్యార్థి విభాగం అధ్యక్షులు ధనుంజయ్, పాణ్యం విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంతోష్, జశ్వంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగులను మోసం చేసిన
చంద్రబాబు సర్కారు
నంద్యాలలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి,
యువజన విభాగం ఆధ్వర్యంలో
అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన


