● గిట్టుబాటు ధరలేక రైతుల ఇక్కట్లు
● బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే
కాటసాని రామిరెడ్డి
బనగానపల్లె: చంద్రబాబు ప్రభుత్వం ఒక్క గింజను కూడా మద్దతు ధరతో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. ఇల్లూరుకొత్తపేట సమీపంలోని పంట కల్లాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులు తమ కష్టాలను మాజీ ఎమ్మెల్యేకు చెప్పారు. తాము పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయనందుననే దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రైతుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గిట్టుబాటు ధర కోసం రైతులు రోజుల తరబడి పంటను కల్లాల్లో ఉంచుకోవాల్సి వస్తోందన్నారు.
యూరియా రాదు.. డీజిల్ లేదు
రెండేళ్లుగా యూరియా లభించక రైతులు బస్తా రూ.500 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చిందని కాటసాని అన్నారు. డీజిల్ కొరతతో పంట నూర్పిడిలు సక్రమంగా జరగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అకాల వర్షాలతో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసినా పలకరించేవారు కరువయ్యారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. లేదా అనే అనుమానాలు వస్తున్నాయన్నారు. మొక్కజొన్న, వరికి గిట్టుబాటు ధరలు లేవని, ఎరువుల ధరలు మాత్రం ఉహించని విధంగా పెరుగుతున్నాయన్నారు. వ్యవసాయం నుంచి రైతులను దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందన్నారు.
డబ్బులు లేవా?
పంట నష్టం జరిగిన వెంటనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు పరిహారం ఇచ్చిందని కాటసాని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో రైతులకు నష్టపరిహారం రాలేదన్నారు. డబ్బులు లేవంటూనే విజయవాడ వద్ద బుడమేరు ముంపు కింద కొన్ని కోట్ల రూపాయలు వృథా చేశారని విమర్శించారు. యోగా కోసం ఇటీవల రూ.360 కోట్లు ఖర్చు చేసి కంపచెట్ల తొలగింపు చేశారని, రైతుల వద్దకు వచ్చే సరికి డబ్బులు లేవని దొంగ మాటలు చెబుతున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం ప్రీమియం చెల్లించి రైతులకు పంట నష్టం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని, ఎరువుల కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశాారు. పంటలకు గిట్టుబాటు అందకపోతే పార్టీలకుతీతంగా ఐక్యతతో ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాటసాని వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు అంబటి రవికుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు అందె శ్రీనివాసరెడ్డి, పి మనోహర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, రాఘవరెడ్డి, జాన్, రామసుబ్బయ్య కృష్ణ, వెంట్రామిరెడ్డి, సురేష్,కిశోర్, సుబ్బారెడ్డి ఉన్నారు.


