చాగలమర్రి మండల పరిషత్ కార్యాలయంలో కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ పేరును అధికారులు కాంట్రాక్టర్‌గా నమోదు చేశారు. మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఈ రెండు నెలల్లోనే సుమారు రూ. 2.84 కోట్లకు పైగా డ్రా చేసుకుని మండల, జిల్లా స్థాయి అధికారులు పంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాగే జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పంచాయతీల్లో బినామీల పేర్లు పెట్టుకుని అధికారులు రూ. కోట్ల నిధులు దారిమళ్లించి పంచుకున్నట్లు తెలుస్తోంది.
మా గ్రామానికి సంబంధించి మేము ఖర్చు చేసిన నిధులు రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా రాలేదు. వచ్చిన నిధులు మాత్రం అధికారులే డ్రా చేసుకున్నారు. మండల ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం ఓటీపీ చెప్పమన్నారు. అంతే అవి బినామీల పేరుతో డ్రా చేసుకున్నారు. ఈ సంవత్సరమే సుమారు రూ 1.5 లక్షలు డ్రా చేసుకున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
– యామ నరసమ్మ,
తాజా మాజీ సర్పంచ్, చిన్న బోధనం
రెండేళ్లుగా గ్రామ అభివృద్ధి కోసం చేసిన పనులకు సంబంధించి బిల్లులు చేయించుకునేందుకు అధికారుల చుట్టూ తిరిగితే 50 శాతం పర్సెంటేజీ ఇస్తే బిల్లులు పెడుతామని చెప్పారు. ఎందుకు ఇవ్వాలని నిలదీస్తే టీడీపీ నేతలు అస్సలు బిల్లు పెట్టొద్దు అన్నారని చెప్పారు. వారు చెప్పినట్లుగానే 50 శాతం ఇస్తానని ఒప్పందం చేసుకుని ముందుగా 30 శాతం డబ్బులు కూడా తీసుకున్నారు. 8 నెలలుగా తిప్పుకుని చివరకు బిల్లులు పెట్టలేదు. అధికారులు విచారించి మాకు న్యాయం చేయాలి.
– నరసింహారెడ్డి,
తాజా మాజీ సర్పంచ్, డి.కొట్టాల
చాగలమర్రి మండలంలో ఓ గ్రామ సర్పంచ్‌కు గత ఏడాది ప్రభుత్వ ఉద్యోగం రావడంతో సర్పంచ్ పదవీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో సర్పంచు లేరు. ఇదే అదునుగా భావించిన అధికారి, కాంట్రాక్ట్ ఉద్యోగి, సెక్రటరీలు కలిసి ఓ డమ్మీ పేరు పెట్టుకుని రూ. 8 లక్షలు డ్రా చేసుకుని పంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే మండలంలోని ఓ మేజర్ పంచాయతీలో కూడా సుమారు రూ. 60 లక్షల దాక నిధులు దారి మళ్లించి పంచుకున్నారన్న చర్చ జరుగుతోంది.
రుద్రవరం మండలం ముత్తలూరులో గ్రామ మాజీ సర్పంచ్‌కు పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసి రూ. లక్ష బిల్లు పెడుతున్నాం.. ఓటీపీ చెప్పమనడంతో ఆమె చెప్పింది. తరువాత పరిశీలిస్తే రూ. 30 లక్షల వరకు బిల్లు పెట్టుకున్నారు. ఆరా తీస్తే గ్రామ టీడీపీ నాయకుడి పేరు మీద మెటల్ రోడ్లు వేసినట్లు నిధులు డ్రా చేసుకుని సెక్రటరీ, అతను పంచుకున్నారు. మాజీ సర్పంచ్ అఽధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదే మండలంలో మేజర్ పంచాయతీలో రూ. 30 లక్షలు నిధులు దారిమళ్లినట్లు తెలుస్తోంది.
ఆళ్లగడ్డ: పంచాయతీ సర్పంచ్‌లు మాజీలయ్యారు. గతంలో చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాలేదు. పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినా ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోలేదు. ఈ సమయంలో కొందరు అధికారులు, టీడీపీ నేతలు పంచాయతీ నిధులను కొల్లగొడుతున్నారు. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల ఇన్‌చార్జ్‌ల పేరుతో పర్సెంటేజీలు వసూలు చేసి బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. పనులు చేసిన వారికి సైతం తెలియకుండానే నిధులు పంచుకుంటుకున్నారు. ఉన్నతాధికారులు సైతం ప్రోత్సహిస్తుండటంతో వారి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు సుమారు రూ. 300 కోట్లు ఆర్థిక సంఘం నిధులు విడుదల కాగా ఇందులో సుమారు రూ. 187 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో 90 శాతం మేరకు అధికారులే కాంట్రాక్టర్లుగా తమ బినామీ పేర్లు పెట్టుకుని డ్రా చేసుకోగా మరికొందరు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, గ్రీన్ అంబాసిడర్ల పేరుమీద కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఏర్పాటు చేసుకుని రూ. కోట్లు ప్రజల సొమ్ములు స్వాహా చేశారు. కొందరు మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీతో కుమ్ముక్కు అయ్యి నిధులు కొల్లగొడుతున్నారు. ఉన్న నిధుల్లో ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ నాయకులకు 50 శాతం పర్సేంటేటీ ఇస్తే డ్రా చేసుకోవచ్చని ఒప్పందం చేసుకుని బినామీ పేర్లు పెట్టుకుని కోట్లాది రూపాయల నిధులు నొక్కేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ మద్దతుదారు సర్పంచ్‌లు పర్సేంటేజీలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినందుకు వారికి ఒక్క రూపాయి కూడా బిల్లులు చేయకుండా వేధిస్తున్నారు.
పీఎస్‌లే ఇంజినీర్లు.. !
పంచాయతీ పరిధిలో ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఎస్టిమేషన్ వేసి పని పూర్తయిన తరువాత సంబంధిత ఇంజినీరింగ్ శాఖ అధికారులు పరిశీలించి ఎంబుక్ పూర్తి చేసిన తరువాత కాంట్రాక్టర్‌కు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంజినీర్లు లేకుండా కొందరు పీఎస్‌లు వారే ఎస్టిమేషన్ వేసి ఎంబుక్‌లు రాసుకోవడం ఒక ఎత్తైతే, మరి కొందరు ఇంజినీర్ల సంతకాలు వారే పెట్టుకుని సీల్ వేసుకుని నిధులు డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది.
పీఎంఎస్‌లో కనిపించని వివరాలు
అభివృద్ధి పనులు మొదలు పెట్టే సమయంలో పని పేరు, సామర్థ్యం, నిధుల వివరాలు, పీఎఫ్‌ఎంఎస్ (పబ్లిక్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) పూర్తి వివరాలు, కాంట్రాక్టర్ పేరు పోర్టర్‌లో నమోదు చేసి నిధులు విడుదల చేయాలి. అయితే అనేక చోట్ల ఇదేమీ జరగలేదు. పీఎఫ్‌ఎంఎస్ నమోదు చేయకుండా మెటల్ రోడ్డు, సీసీ రోడ్డు, శానిటేషన్ అని నమోదు చేసి రూ. కోట్లు డ్రా చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 90 శాతం గ్రామాల్లో అభివృద్ధి పనుల పేరుతో డ్రా చేసిన కాంట్రాక్టర్లు జీఎస్టీ బిల్లులు లేకుండా చిత్తుకాగితాలపై ఎస్టిమేషన్ వేయించి బిల్లులు డ్రా చేసినట్లు రికార్డుల్లో నమోదై ఉంది.
మచ్చుకు కొన్ని..
చాగలమర్రిలోని పంచాయతీ గ్రామ సర్పంచ్ మృతి చెందగా అక్కడ బినామీ పేరు పెట్టుకుని రూ. 12 లక్షలు స్వాహా చేశారు.
శిరివెళ్లకు చెందిన ఓ అధికారి శిరివెళ్ల, ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల్లోని పంచాయతీ సెక్రటరీలతో మాట్లాడి 30 నుంచి 50 శాతం మేరకు పర్సేంటేజీ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మూడు మండలాల పరిధిలో సుమారు రూ. 2 కోట్లు నొక్కేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రుద్రవరం మండలంలో ఏఈగా పనిచేస్తున్న అధికారి బహిరంగంగానే ఎంబుక్ చేయాలంటే 20 శాతం, బిల్లులు చేయాలంటే 30 శాతం ఇవ్వాల్సిందే వసూలు చేస్తున్నట్లు సమాచారం.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పనిచేస్తున్న ఓ ఏఈ ఇలాంటి నిధులను డ్రా చేసుకుని పంచుకున్న అక్రమ సంపాదనతో చాగలమర్రి మండలం శెట్టూరు – తండా మధ్యలో ఇటీవల రూ. 90 లక్షల పెట్టి వ్యవసాయ పొలం కొనుగోలు చేసినట్లు సమాచారం.
అధికారులు, టీడీపీ నేతల కుమ్మక్కు
చేసిన పనులకు 50 శాతం వరకు
పర్సెంటేజీలు వసూలు
చేయని పనులకు సైతం బిల్లులు
మొత్తం డ్రా చేసిన వైనం
కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరుతో
ఏజెన్సీలు ఏర్పాటు చేసి నిధుల దోపిడీ


